రేవంత్, సండ్రలతో ఫోన్ సంభాషణ: రెండో రోజు వేం కుమారుడి విచారణ
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు తెలుగుదేశం పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని రెండో రోజు గురువారంనాడు కూడా విచారించారు. బుధవారంనాడు ఎనిమిదిన్నర గంటల పాటు ఆయనను ఎసిబి అధికారులు విచారించారు.
గురువారంనాడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ఎసిబి అధికారులు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం పదిన్నర గంటల నుంచి ఐదున్నర గంటల పాటు విచారించారు. ఈ కేసులో ఆయనను సాక్షిగానే విచారిస్తున్నట్లు ఎసిబి అధికారులు ఇప్పటికే చెప్పారు.
కృష్ణకీర్తన్‌తో పాటు నోటుకు ఓటు కేసులో నిందితులు సెబాస్టియన్, ఉదయసింహలను కలిపి ఎసిబి అధికారులు విచారించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపైనే ఎసిబి అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో ఫోన్‌లో ఎందుకు మాట్లాడారని ఎసిబి అధికారులు బుధవారంనాడు కృష్ణ కీర్తన్ రెడ్డిని అడిగినట్లు సమాచారం.

కృష్ణ కీర్తన్ రెడ్డి తండ్రి వేం నరేందర్ రెడ్డిని ఎసిబి అధికారులు ఇప్పటికే విచారించారు. కేసులో నిందితులైన శాసనసభ్యులు రేవంత్ రెడ్డిని, సండ్ర వెంకటేశ్వర రావులతో పాటు ఉదయసింహ, సెబాస్టియన్‌లను ఎసిబి అధికారులు ఇప్పటికే విచారించారు.
సండ్ర వెంకటవీరయ్యతో జరిపిన సంభాషణలతో మొదలైన విచారణలో అనేక అంశాలను ఏసీబీ బుధవారంనాడు రాబట్టినట్లు సండ్రతో పదే పదే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని కృష్ణకీర్తన్‌ను ప్రధానంగా ఏసీబీ ప్రశ్నించింది. ఏసీబీ సేకరించిన వివరాల ప్రకారం కనీసం 9 సార్లు కృష్ణకీర్తన్ తన ఫోన్ నుంచి సండ్రకు ఫోన్‌చేశారు. ఈ కాల్స్ అన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నపుడే వెళ్లాయి. ఈ సమయంలో ఫోన్లో ఏఏ అంశాలు చర్చించారని ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది.
ఇదే కేసులో ఏ1గా ఉన్న రేవంత్‌తో కూడా ఇదే సమయంలో నాలుగుసార్లు కృష్ణకీర్తన్ మాట్లాడారు. ఈ ఇద్దరితో పదే పదే మాట్లాడటం వెనుకున్న ఉద్దేశమేమిటనే వివరాలతోపాటు కుట్రలో పాత్రధారులకు సంబంధించిన వివరాలపైన కూడా ఆరాతీశామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. కుట్రలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే వివరాలు కృష్ణకీర్తన్ నుంచి రాబట్టామని, స్టేట్‌మెంట్ రికార్డు చేశామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications