గాయనిపై యాసిడ్ దాడి: మాజీ ప్రియుడి పనేనా?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ గాయనిపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె మాజీ ప్రియుడే ఈ దాడి వెనక ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె సహోద్యోగి హైమద్ కూడా గాయకుడు. ఆమెపై యాసిడ్ దాడి అతని పనే అయి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
24 ఏళ్ల బాధితురాలు హైమద్‌తో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది. అయితే, అతను తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాధితురాలు పలుమార్లు హైమద్‌తో వాగ్వివాదానికి దిగింది. దీంతో అతను విసిగిపోయినట్లు భావిస్తున్నారు.

బుధవారంనాడు బాధితురాలికి ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలోని పార్కు వద్ద నడిచి వెళ్తున్న సమయంలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.
యాసిడ్ దాడిలో గాయని స్వల్పంగా గాయపడింది. ఆమెకు ప్రాణాపాయం లేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు హైమద్‌ను ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications