హైదరాబాద్ భూములకు రెక్కలు: ఎకరం ధర రూ. 29.3 కోట్లు
దరాబాద్: హైదరాబాద్ నగరంలో భూములకు రెక్కలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ధరలు పెరుగుతున్నాయని మరోసారి రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఐఐసీ ద్వారా రాయదుర్గం, కోకాపేట, మణికొండ ప్రాంతాల్లో భూములను వేలం వేసింది. ఇందులో అరబిందో ఫార్మా తదితర కంపెనీలు ఎకరానికి గరిష్ఠంగా 29.28 కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేశాయి.
భూముల విక్రయాల్లో ఇప్పటికి ఇదే రికార్డు. గత నెల 30న ఈ-టెండర్ కమ్ ఈ-ఆక్షన్‌కు టీఎస్‌ఐఐసీ ప్రకటన ఇచ్చింది. బుధవారం మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు ఆన్‌లైన్‌లో ఆక్షన్ నిర్వహించారు. రాయదుర్గం భూములు వాణిజ్య, ఇతర అవసరాల కోసం వినియోగించేవి కాగా, కోకాపేట, మణికొండ భూములు నివాస గృహాల నిర్మాణం కోసం ఉద్దేశించినవి.
రాయదుర్గంలోని భూమిని ఎకరానికి రూ.29.28 కోట్ల ధర పెట్టి అరబిందో ఫార్మా కంపెనీ మొత్తం ఐదు ఎకరాలు కొనుగోలు చేసింది. అదే అరబిందో కంపెనీ రాయదుర్గంలోనే మరో బిట్‌ను ఎకరానికి రూ.24.88 కోట్ల ధరతో 3.65 ఎకరాలు కొన్నది. నయా ఇన్‌ఫ్రా కంపెనీకూడా ఎకరానికి రూ.24.20 కోట్ల ధరతో రెండు ఎకరాలు కొనుగోలు చేసింది. సైమెడ్ ల్యాబ్స్ ఎకరానికి రూ. 22.02 కోట్ల ధరకు 3 ఎకరాలను కొనుగోలు చేసింది. హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద మొత్తంలో ధరకు భూమి విక్రయం జరగడం ఇదే ప్రథమం.

2007-08 సంవత్సరంలో ఏపీఐఐసీద్వారా అదే రాయదుర్గంలోని ప్రభుత్వ భూముల విక్రయం జరిగినప్పుడు ఎకరానికి రూ.18 కోట్లనుంచి రూ.23కోట్ల వరకు ధర పలికింది. కానీ ఇప్పుడు అప్పటికన్నా చాలా ఎక్కువగా ధర వెచ్చించి భూములు కొనుగోలు చేయడానికి పేరు మోసి కంపెనీలు ముందుకు వచ్చాయి.
మణికొండ, కోకాపేట ప్రాంతాల్లో నివాస గృహాల నిర్మాణంకోసం ఉద్దేశించిన భూముల విక్రయంలోనూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. మణికొండలో ఎర్త్ పేవర్స్ కంపెనీ ఎకరానికి రూ.12.63 కోట్ల చొప్పున, కోకాపేటలో గ్లాండ్ సెల్యులోజ్ కంపెనీ ఎకరానికి రూ.6.05 కోట్ల చొప్పున వెచ్చించి భూములు కొనుగోలు చేశాయి. టెండర్ ఖరారు అయినవారికి త్వరలోనే భూములు అప్పగిస్తామని టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications