కొండాపై చర్యలు.. ఆ ఎమ్మెల్యేలకు ఇజ్జత్ కా సవాల్!
ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఓరుగల్లులోని ఎమ్మెల్యేలు, స్థానిక కాంగ్రెస్ నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సంచలన ఆరోపణలు చేయడం పెను దుమారాన్ని రేపాయి.
కొండా దంపతుల తీరుతో పార్టీలో సఖ్యత పోయింది
మంత్రి కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు మూకుమ్మడిగా అధిష్టానం పై ఒత్తిడికి దిగుతున్నారు. ఇక తాజాగా గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ తో సమావేశమైన నేపథ్యంలో కూడా కొండా ఫ్యామిలీని భరించే ఓపిక తమకు లేదని తేల్చి చెప్పారు. కొండా దంపతుల తీరు వల్ల పార్టీలో సఖ్యత పోయిందని అన్నారు.

కొండా పై చర్యలకు కడియం పట్టు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, కొండా దంపతులు స్థానిక నాయకులను చిన్నచూపు చూస్తున్నారని వారు ఆరోపించారు. ఇక కడియం శ్రీహరి అయితే కొండా మురళి పైన చర్యలు తీసుకోకపోతే తాను రాజకీయాలు చెయ్యలేనని తేల్చి చెప్పినట్టు సమాచారం. కొండా దంపతులు తమను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారితో కలిసి జిల్లాలో రాజకీయాలలో కొనసాగడం కష్టమని అధిష్టానానికి తేల్చి చెప్పారు.
ఆ నేతలకు ఇజ్జత్ కా సవాల్
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కొండా మురళి పీడ నుండి తమకు తక్షణమే విముక్తి కల్పించాలని క్రమశిక్షణ కమిటీ ముందు వాపోయారు. కొండా దంపతుల ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని వారు తేల్చి చెప్పారు. ఇది తమ ఇజ్జత్ కా సవాల్ అంటూ అందరూ ముక్తకంఠంతో చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఇక తాజా పరిస్థితులతో కొండా వ్యవహారంలో కాంగ్రెస్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా పరిస్థితి మారింది.
అధిష్టానం ఆలోచన ఇలా
చర్యలు తీసుకుంటే రాజకీయంగా బలంగా ఉన్న కొండా వర్గాన్ని దూరం చేసుకున్నట్టుగా పరిస్థితి మారుతుంది. చర్యలు తీసుకోకపోతే వరంగల్ ఎమ్మెల్యేలు ఊరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని మరికొద్ది రోజులపాటు చర్చల ద్వారా కొనసాగించి క్లోజ్ చేయాలనే ప్లాన్లో ఉంది కాంగ్రెస్ అధిష్టానం.












Click it and Unblock the Notifications