BRS: మంచిర్యాల బీఆర్ఎస్‍లో అసమ్మతి.. అభ్యర్థిని మార్చకుంటే ఓడిస్తామని హెచ్చరిక..
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి పలుచోట్ల అసమ్మతి వ్యక్తం అవుతోంది. తాజాగా మంచిర్యాల బీఆర్ఎస్ లో అసమ్మతి తారాస్థాయికి చేరింది. మంచిర్యాల గులాబీ పార్టీ అభ్యర్థిని మార్చాలని మాడీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కోరారు. లేకుంటే బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని హెచ్చరించారు. వారం రోజుల్లో అభ్యర్థిని మార్చకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు కు ఇచ్చారు.
అయితే దివాకర్ రావు టికెట్ రావడంపై అరవింద్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మంచిర్యాలలోని తన నివాసంలో అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు హాజరయ్యారు. ఉద్యమ సమయంలో పార్టీని ముందుండి నడిపించిన అరవింద్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టికెట్ ఇవ్వని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు.

దివాకర్ రావు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలేదని అరవింద్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాన్ని పదేళ్లు వెనక్కు తీసుకేళ్లారని విమర్శించారు. మిషన్ భగీరథ నిరూపయోగంగా మారిందన్నారు. మంచిర్యాలలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డు కూడా లేదనన్నారు. మరోసారి దివాకర్ రావును గెలిపిస్తే మంచిర్యాల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. మూడు పార్టీలు వెలమ సామాజిక వర్గాలకు తప్ప.. నియోజకవర్గంలో ఎక్కువగా ఉండే బీసీలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు.
బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గంలో కూడా అసమ్మతి చెలరేగింది. నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ఇంటికి వెళ్లారు. అయితే మల్లయ్యను కలిసేందుకు చందర్ రావు నిరాకరించారు. దీంతో మల్లయ్య యాదవ్ వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications