ఈడీ విచారణకు హాజరైన నటుడు నవదీప్; ఆ లావాదేవీలపై విచారణ!!
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో విచారణ ఎదుర్కొంటున్న నవదీప్ కు తాజాగా ఈడి అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో నేడు ఈడి అధికారుల ముందు నవదీప్ హాజరయ్యారు.
టాలీవుడ్ హీరో నవదీప్ ను ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి అనేక ప్రశ్నలను సంధిస్తున్నారని సమాచారం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నమోదు చేసిన కేసుతో మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఈడి రంగంలోకి దిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ ను నేడు విచారణకు హాజరు కావాలని పేర్కొనడంతో, హీరో నవదీప్ ఈరోజు హైదరాబాద్ లో ఈడీ విచారణకు హాజరయ్యారు.

డ్రగ్స్ విక్రేతలతో జరిపిన లావాదేవీలపై ఆయనను ఈడి అధికారులు విచారిస్తున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలపై అధికారులు లోతుగా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్స్, మెసేజుల ఆధారంగా విచారించే అవకాశముంది. గుడి మల్కాపూర్ ఠాణా పరిధిలో ఇటీవల నమోదైన మాదక ద్రవ్యాల కేసులో బహిర్గతమైన అంశాల ఆధారంగా విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇవ్వటంతో నవదీప్ ఈడీ ముందు హాజరయ్యారు.
ఈరోజు ఈడీ అధికారులు నవదీప్ నుండి ఎలాంటి అంశాలను ఆయన విచారణలో సేకరించనున్నారో అన్న ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉంటే మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికిన నైజీరియన్ డ్రగ్స్ పెడ్లర్ తో పాటు, తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నా రెడ్డి, రాం చందర్ లను విచారించటంతో నవదీప్ పేరు బయటకు వచ్చింది.
దీంతో ఆయన కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆపై కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో నవదీప్ ను కొద్ది రోజుల క్రితం టీ న్యాబ్ పోలీసులు సుమారు ఆరు గంటల పాటు విచారించారు. ఇప్పుడు మళ్ళీ హీరో నవదీప్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications