అందులో ఏముంది?: ఆ పెన్‌డ్రైవ్ నా జీవితం అంటున్న సినీ నటి
హైదరాబాద్: 'పెన్‌డ్రైవ్ కోసం పోలీసుల హల్‌చల్' అంటూ వివిధ పత్రికల్లో వార్తలు రావడం పట్ల సినీ నటి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాధా ప్రశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. తన వివరణ తీసుకోకుండా మీడియా తప్పుడు వార్తలు ప్రచురించిందని ఆరోపించారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోయిన పెన్‌డ్రైవ్ వెల గురించి కాదని, అందులో తన జీవితం ఉందని అన్నారు. ఆ పెన్‌డ్రైవ్‌లో తన ఫొటోలు, తన కుటుంబసభ్యుల ఫొటోలు ఉన్నాయని, వాటిని మార్ఫింగ్ చేస్తే పరిస్థితి ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు వారాల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన జగదీష్ అనే వ్యక్తి ఓ రోజు తన ఇంటికి వచ్చాడని... తాను రాష్ట్రపతి అవార్డుగ్రహీతను కావడం, పలు సామాజిక కార్యక్రమాల్లో ముందుండటం, 100కు పైగా సినిమాల్లో నటించడంతో తన కోసం ఒక ప్రత్యేక పేజీ రూపొందిస్తానని తన కంప్యూటర్ పైనే కూర్చున్నాడని చెప్పారు.

ఇంతలో తాను లోపలికి వెళ్లగానే... అతడు తన పెన్‌డ్రైవ్‌ను తీసుకెళ్లాడని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని అన్నారు. ఆ తర్వాత అతడి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చిందని అన్నారు. ఆ పెన్‌డ్రైవ్‌లో తన కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు తాను సినిమాల్లో నటించినప్పటి ఫొటోలు, విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయని అన్నారు.
అందుకే తాను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనిపై పలు రకాలుగా వార్తాలు రాయడం తనను తీవ్రంగా బాధిస్తోందన్నారు. తన వివరణ తీసుకోకుండా అలా ఎలా వార్తలు ప్రచురిస్తారని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా మీడియా ఈ తప్పుడు ధోరణి మార్చుకోవాలని ఆమె సూచించారు.












Click it and Unblock the Notifications