రేవంత్ సీఎం అయ్యాక తెలంగాణా భూముల ధరల సీన్ రివర్స్!
మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాల భూమి వచ్చేదని రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరా భూమి అమ్మితే ఇప్పుడు, తెలంగాణలో రెండు ఎకరాల భూమి వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక ఇటువంటి పరిస్థితి తీసుకువచ్చాడని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రజ్ఞాపూర్ లో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకుల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపైన నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల దీనస్థితిని పట్టించుకోవడంలేదని హరీష్ రావు అన్నారు.

ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని రేవంత్ పై సెటైర్లు
వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రుల పాలు అవుతుంటే కూడా రేవంత్ రెడ్డి మనసు కరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన చక్కదిద్దడం చేతకాక ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని రేవంత్ పై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ 20నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి హరీష్ రావు అభిప్రాయం వ్యక్తంచేశారు.
రేవంత్ హయాంలో ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా
ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, పెన్షన్ల విషయంలో కూడా 2లక్షల పెన్షన్లు తీసేసి నష్టం చేశారని పేర్కొన్నారు. కెసిఆర్ హయాంలో నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు ఇస్తే, రేవంత్ హయాంలో ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మళ్లీ ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని, స్థానికసంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకుండా విజయకేతనం ఎగురవేసే దిశగా శ్రేణులు పనిచేయాలని అన్నారు.
రేవంత్ రెడ్డి గురుకులాలను అధో పాతాళానికి దిగజార్చారు
ఇక రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఎవరి పోటీలో ఉంటారనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కెసిఆర్ గురుకులాల ఖ్యాతిని ఎవరెస్టు శిఖరం ఎత్తును నిలబడితే రేవంత్ రెడ్డి గురుకులాలను అధో పాతాళానికి దిగజార్చారని మండిపడ్డారు. ఇప్పటికే 20 నెలల కాంగ్రెస్ పాలనలో పాము కాట్లు, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ ఘటనలతో వందకు పైగా గురుకులాల విద్యార్థుల ప్రాణాలు కోల్పోతే రేవంత్ రెడ్డి ఎందుకు సీరియస్ గా తీసుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications