సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి
Vande bharat express: సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. మహబూబాబాద్-గార్ల రైల్వే స్టేషన్ల మధ్య ఓ దుండగుడు రాయి విసిరాడు. దీంతో ఓ బోగి అద్దాలు ధ్వంసమయ్యాయి.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై వరుస రాళ్ల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. మహబూబాబాద్-గార్ల రైల్వే స్టేషన్ల మధ్య ఓ దుండగుడు రాయి విసిరాడు. దీంతో ఓ బోగి అద్దాలు ధ్వంసమయ్యాయి.
రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే రక్షక దళం అప్రమత్తమైంది. నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. వందే భారత్ రైలు సీ-8 కోచ్‌లో సీటు నెంబర్ 41,42,43 వద్ద ఉన్న అద్దం పగిలిందని, అయితే, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.

కాగా, గతంలో కూడా వందేభారత్ రైలు ప్రారంభానికి ముందు ఆకతాయిలు రాళ్లు విసిరిన ఘటన విశాఖలో జరిగింది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా విశాఖ స్టేషన్ నుంచి కోచ్ కాంప్లెక్స్‌కు రైలు వెళ్తుండగా.. కంచరపాలెం రామ్మూర్తి దంపతులుపేట రాగానే కొందరు దుండగులు రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వందే భారత్ రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది.
కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి దాడులు జరగడం గమనార్హం. ఇలాంటి దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాజాగా, మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications