జూబ్లీహిల్స్ సీటు పై ఢిల్లీ ట్విస్ట్, ఇద్దరు మాజీ ఎంపీల పట్టు- కాంగ్రెస్ అభ్యర్ధిగా..!!
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి దాదాపు ఖరారయ్యారు. అనేక తర్జన భర్జనల తరువాత కాంగ్రెస్ నాయకత్వం ఎట్టకేలకు నిర్ణయానికి వచ్చింది. ఈ సీటు కోసం అనేక మంది ఆశావాహులు పోటీ పడ్డారు. ముగ్గురు పేర్లతో రాష్ట్ర నేతలు ఏఐసీసీకి జాబితా పంపారు. మాజీ ఎంపీ ఢిల్లీ కేంద్రంగా తనకు సీటు వచ్చేలా శక్తి మేర ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ తన అభిప్రాయం స్పష్టం చేసారు. ఈ క్రమంలో హైకమాండ్ చివరకు బీసీ అభ్యర్ధి వైపే మొగ్గు చూపింది. ఆ ఇద్దరిలో ఒకరి పేరును ఈ సాయంత్రం అధికారికంగా ప్రకటన చేయనుంది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్దిగా తుది జాబితాలో ఇద్దరి పేర్లు ఉన్నాయి. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం కీలకంగా మారుతోంది. పీసీసీ ఇప్పటికే మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ముగ్గురు పేర్లను ఢిల్లీకి పంపింది. తొలి నుంచి ఇక్కడ నవీన్ యాదవ్ కు సీటు ఇస్తారనే ప్రచారం ఉంది. కాగా, రేసు నుంచి బొంతు రామ్మోహన్ తప్పుకున్నారు. ఆయనే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌లు ఇన్‌చార్జి మంత్రులు సూచించిన పేర్లపై సమీక్షించారు. నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లను అధిష్ఠానానికి పంపారు. ఆయా అభ్యర్థుల సానుకూల, ప్రతికూల అంశాలను వివరించారు.

బొంతు రామ్మోహన్ తాను జూబ్లీహిల్స్ అభ్యర్థి రేసులో లేనని స్పష్టం చేశారు. తనకు టికెట్ కావాలని ఎవరినీ అడగలేదన్నారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. టీపీసీసీ ప్రతిపాదించిన మూడు పేర్లను అధిష్ఠానం పరిశీలించి, అభ్యర్థిని ఎంపిక చేయనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అభీష్టం మేరకే అభ్యర్థిని నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక నేతనే అభ్యర్థిగా ఎంపిక చేయాలన్న ప్రతిపాదనకే సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారు. స్థానిక కోటాలో నవీన్‌యాదవ్, సీఎన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. అయితే, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమారుడు ఎంపీ అయినా.. తాను పార్టీకి చేసిన సేవలను పరిగణలోకి తీసుకోవాలని.. సీటు కేటాయించాలని కోరుతున్నారు.
కాగా, ఇక్కడ సీఎం రేవంత్ తన అభిప్రాయం పార్టీ నాయకత్వానికి వెల్లడించినట్లు తెలుస్తోంది.మరోవైపు టీపీసీసీ ప్రతిపాదించిన మూడు పేర్లు కాకుండా అనూహ్యంగా ఇతర సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. బిహార్ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం భేటీ కానుంది. ఆ భేటీలో జూబ్లీహిల్స్ అభ్యర్థి అంశం పైనా చర్చించే అవకాశం ఉంది. అటు అజాహరుద్దీన్ సైతం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. టీపీసీసీ నుంచి వచ్చే పేర్లలో ఒకరిని ఖరారు చేస్తారా.. మరింత సమాచారం కోరుతారా అనేది అభ్యర్ధుల్లో ఉత్కంఠ పెంచుతోంది. అయితే.. ఉప ఎన్నిక కావటంతో స్థానిక నాయకత్వం సూచన మేరకే అభ్యర్ధిని ఖరారు చేస్తారని చెబుతున్నారు. దీంతో.. ఈ సాయంత్రానికి కాంగ్రెస్ అభ్యర్ధి పైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications