అలెర్ట్: 78వేల రాయితీ ఇస్తున్నా పట్టించుకోరా.. అయితే మీకే నష్టం!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చడం కోసం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేయడానికి నిర్దేశించిన ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం బాగా వెనుకబడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 19,985 ఇళ్లపై మాత్రమే సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు MNRE తాజా గణాంకాలు చెబుతున్నాయి.
తెలంగాణాలో నత్తనడకన ఆ కేంద్ర పథకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 60 వేల పైన ఈ వ్యవస్థను ఏర్పాటు చేయగా, అత్యధికంగా గుజరాత్లో 4.55 లక్షల ఇళ్లపై, కేరళ రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ పథకం అమలు నత్త నడకన సాగుతుందని తాజా గణాంకాలతో తెలుస్తోంది.

సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే బోలెడు లాభాలు
ఈ పథకం ద్వారా కరెంట్ బిల్లులు ఆదా అవుతాయని, అలాగే సోలార్ ప్యానల్స్ ద్వారా అదనపు విద్యుత్ ను ప్రొడ్యూస్ చేస్తే వాటిని తిరిగి డిస్కం లు కొనుగోలు చేస్తాయని, అందుకు మనకు డబ్బులు కూడా ఇస్తాయని కేంద్రం చెబుతోంది. రెండు కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడానికి లక్ష ఇరవై వేల రూపాయల ఖర్చు వస్తుంది.
మూడు కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ కు 78వేల రాయితీ
ఇందులో 60 వేల రూపాయలను ఇంటి యజమాని భరిస్తే మిగతా 60 వేల రూపాయల డబ్బులు రాయితీ లభిస్తుంది. ఇక మూడు కిలోవాట్ల విద్యుత్తు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుతో మొత్తం 78 వేల రూపాయల రాయితీ పొందవచ్చు. రెండు కిలోవాట్ల సోలార్ ప్యానల్స్ ఏర్పాటుతో 250 యూనిట్లలోపు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
ప్రచారం చేస్తే ఈ స్కీమ్ అమలుకు ఆస్కారం
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.35 కోట్ల సాధారణ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ఒక కోటి పది లక్షల కనెక్షన్లు నెలకు 240 యూనిట్ల విద్యుత్ ను మాత్రమే వినియోగిస్తున్నాయి. అయితే ఇటువంటి వర్గాలను టార్గెట్ చేసి దీని పైన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.
తెలంగాణా ప్రభుత్వంపైనే బాధ్యత అంతా
ఈ పథకాన్ని ప్రోత్సహిస్తే తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని నిధులు అందిస్తామని ఎం ఎన్ ఆర్ ఈ ఇప్పటికే ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం పీఎం సూర్య ఘర్ విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని పొంది, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను కూడా తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications