పదో వసంతంలోకి తెలంగాణ - 21 రోజుల సంబురాలు..!!
కోట్లాది మంది కల ఫలించిన రోజు. అమరుల త్యాగాల స్ఫూర్తి..తెలంగాణ ప్రజల ఐకమత్యంతో పోరాడి సాధించుకొన్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు సర్వం సిద్దమైంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 21 రోజుల పాటు వేడుకలు నిర్వహించనుంది. అన్ని పార్టీలు సంబురాలకు సిద్దమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే సంబురాలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దశాబ్ది ఉత్సవాలకు సిద్దం:తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్రం యావత్తు సమాయత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నాలు, భవనాలను అధికారులు విద్యుద్దీపాలతో అలంకరించారు. త్రివర్ణ విద్యుద్దీపకాంతులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం తళుకులీనుతున్నది. అలాగే, 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని రంగు రంగుల లైట్లతో అలంకరించారు. వేడుకల సమన్వయం కోసం ప్రభుత్వం ఇప్పటికే నోడల్ అధికారులను కూడా నియమించింది.

22వ తేదీ వరకు వేడుకలు:తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రతి రోజూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్ 3న రైతు దినోత్సవం, 4న పోలీసు శాఖ సురక్షా దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, సింగరేణి సంబురాలు, 6న పారిశ్రామిక ఉత్సవం, ఇండస్ట్రియల్ ఐటీ కారిడార్లలో సభలు, 7న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లెప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న గిరిజనోత్సవం, 18న మంచినీళ్ల పండుగ, 19న హరితోత్సవం, 20 విద్యా దినోత్సవం, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, 22న అమరులకు నివాళి, స్మారక చిహ్నం ప్రారంభోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
ప్రభుత్వం..పార్టీలు:ప్రభుత్వంతో పాటుగా గవర్నర్, పలు పార్టీలు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటున్నాయి. గోల్కొండ కోటలో జరిగే వేడుకలకు గవర్నర్ హాజరుకానున్నారు. కేంద్రం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనకు సంభందించి పోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసారు. సాయంత్రం భారత సాంస్కృతిక వైభవంతో పాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై రెండు చిత్రాల ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ గాంధీ భవన్‌లో వేడుకల్లో లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొననున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 11.15 గంటలకు నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications