రాత్రంతా జైలులోనే- న్యాయ పోరాటానికి అల్లు అర్జున్ సిద్ధం..?!
Allu Arjun arrest: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆయన భారీ బందోబస్తు మధ్య గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆయనకు శుక్రవారం సాయంత్రమే నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.
అయినప్పటికీ- విడుదల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల రాత్రంతా జైలులో గడపాల్సి వచ్చింది. ఈ పరిణామాన్ని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది జీ అశోక్ రెడ్డి తప్పు పట్టారు. చంచల్ గూడ సెంట్రల్ జైలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. లీగల్‌గా ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ విడుదల సందర్భంగా చంచల్ గూడ జైలు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రవారం సాయంత్రమే తన క్లయింట్ అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని, అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయాలంటూ చాలా స్పష్టంగా అందులో పేర్కొందని గుర్తు చేశారు. ఈ ఆర్డర్ కాపీని జైలు అధికారులకు అందించామని, దానికి వారు కట్టుబడి ఉండలేదని అన్నారు.
ఆర్డర్ కాపీ అందిన వెంటనే విడుదల చేయకపోవడం సహేతుకం కాదని అశోక్ రెడ్డి వ్యాఖ్యానించారు. చాలా స్పష్టంగా అల్లు అర్జున్‌ను విడుదల చేయాలంటూ మధ్యంతర బెయిల్‌లో పొందుపరిచినప్పటికీ..అలా జరగలేదని, ఎందుకు విడుదలలో జాప్యం చేశారని ప్రశ్నించారు.
దీనికి పోలీసు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఆయనను అక్రమంగా నిర్బంధించినట్టుగా భావిస్తోన్నామని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ నిర్బంధం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై అధ్యయనం చర్చిస్తామని పేర్కొన్నారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట, రేవతి అనే మహిళ దుర్మరణం పాలైన కేసులో అరెస్టయిన అల్లు అర్జున్.. బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్ అడ్వొకేట్ నిరంజన్ రెడ్డి వాదనలను వినిపించారు. వాదనలతో ఏకీభవించిన హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications