సీఎం ప్రకటన నేపథ్యంలో.. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్
సినీనటుడు అల్లు అర్జున్ శనివారం రాత్రి 7 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టడంపై ఆసక్తి నెలకొంది.
అల్లు అర్జున్ తన నివాసంలోనే మీడియాతో మాట్లాడనున్నారు. తనపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో అల్లు అర్జున్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే పలుమార్లు అల్లు అర్జున్ స్పందించిన విషయం తెలిసిందే. రేవతి మృతి బాధ కలిగించిందన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. రూ. 25 లక్షల సాయాన్ని ప్రకటించారు. న్యాయ నిపుణుల సూచన మేరకే తాను కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కలవలేకపోయానని చెప్పారు.

కాగా, పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రస్తావించగా.. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ఆ రోజు జరిగిన ఘటనను వివరిస్తూ.. విపక్ష పార్టీలు, సినీ ప్రముఖులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
సంధ్య థియేటర్ ఘటనలో ఒకరి ప్రాణం పోయిందని, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని సీఎం రేవంత్ చెప్పారు. అతడ్ని ఎవరు పట్టించుకోవడం లేదని, బాధితుల కుటుంబంపై సానుభూతి వ్యక్తం చేయడం లేదని మండిపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి పట్టించుకోకుండా.. బెయిల్ పై విడుదలైన హీరోను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టారని ధ్వజమెత్తారు. థియేటర్ ఘటనలో ప్రాణాలు పోయాయని చెప్పినా.. అల్లు అర్జున్ సినిమా చూసే వెళతానని పోలీసులకు చెప్పినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఇప్పటికీ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై ఆసక్తిక నెలకొంది. సీఎం చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ స్పందించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications