రాష్ట్ర బీజేపీ నేతలకు తేల్చి చెప్పిన అమిత్ షా..!!
రాష్ట్ర బిజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక దిశా నిర్దేశం చేసారు.
తెలంగాణలో అధికారం పైన ఆశలు పెట్టుకున్న బీజేపీ నాయకత్వం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. పార్టీ రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిచిన కేంద్ర హోం మంత్రి అమిత్ పార్టీ నేతలకు తమ ఆలోచనలను స్పష్టం చేసారు. ఏం చేయాలో తేల్చి చెప్పారు. విభేదాలను పక్కన పెట్టాలని నిర్దేశించారు. నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని తేల్చి చెప్పారు. పార్టీలో చేరికల పైన ఆరా తీసారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేసారు. ఇక తరచూ సమావేశాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ప్రధాని ఆధ్వర్యంలో భారీ సభకు నిర్ణయించారు. కొత్త కార్యాచరణ డిసైడ్ చేసారు.
ఢిల్లీ వేదికగా తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చింది.సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేసి కేసీఆర్ విధానాలను ఎండగట్టాలని రాష్ట్ర నేతలకు అమిత్ షా సూచించారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు బాగానే జరిగాయన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని చెబుతూ పరోక్షంగా ఎన్నికల వరకు బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు. నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేయాలని చెప్పారు. వ్యక్తిగత అజెండాలు ఏమైనా ఉంటే పక్కనపెట్టాలన్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలను మరింత ఉధృతం చేయాలని నిర్దేశించారు.

వచ్చే మూడు నెలల పాటు ఏయే కార్యక్రమాలు ఎలా చేయాలో పార్టీ నాయకత్వం దిశా నిర్దేశం చేసింది. ఉమ్మడి జిల్లా స్థాయిలో బహిరంగసభలు నిర్వహించాలని ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో భారీ సభ నిర్వహించాలని సూచించింది. చేరికల ప్రక్రియ ఎందుకు మందగించిందని పార్టీ నాయకత్వం ప్రశ్నించింది. చేరికల సమయంలో ఇచ్చే హామీలను తాము ఆమోదిస్తామని పార్టీ నాయకత్వం భరోసా ఇచ్చింది. సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవాలని, సమర్థులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 12న అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఇదే సమయంలో ధరణి పోర్టల్ గురించి అమిత్ షా ఆరా తీసారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి 119 నియోజకవర్గాల్లో 119 సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 10 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు.












Click it and Unblock the Notifications