రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీలు: కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్, భువనగిరికి కీలక హామీ
భువనగిరి: బీజేపీపై దుష్ప్రచారం చేయడంతోపాటు అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తోందని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. బీజేపీ భువనగిరి లోక్‌సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రాహుల్ పిల్ల చేష్టల హామీలు.. మోడీ గ్యారంటీల మధ్య జరగుతున్న ఎన్నికలివి అని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్తితి దయనీయంగా తయారైందని, ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని విమర్శించారు . ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ అభివృద్ధి మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి అని అమిత్ షా అన్నారు.

కుటుంబ అభివృద్ధి, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరు అని కేంద్రమంత్రి చెప్పారు. మూడు విడతల ఎన్నికల్లో ఇప్పటికే 200 సీట్లకు పైగా స్థానాలు గెలిచామన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. దేశవ్యాప్తంగా మొత్తం 400కు లోక్‌సభ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గత ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ సీట్లు గెలిచామని, ఈసారి మొత్తం 10కి పైగా సీట్లు గెలుస్తామన్నారు.
తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్, దేశంలో 400 సీట్లకు మార్గం సుగమం అవుతుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. అబద్ధాలతో ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని మండిపడ్డారు. మోడీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని అవాస్తవాలు చెబుతున్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు నష్టం. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని అమిత్ షా చెప్పారు. మోడీ ఏది చెబుతారో అది తప్పకుండా చేస్తారని అన్నారు.
రాహుల్ గాంధీ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు కాలేదు. రైతులకు ఏటా రూ.15 వేల ఆర్థికసాయం అమలు చేయలేదు. రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం నెరవేర్చలేదు. వరి, గోధుమలకు రూ.500 బోనస్ హామీ అమలు చేయలేదు. రైతులకు పూచీ లేకుండా రూ.5 లక్షల రుణ హామీ నెరవేరలేదు. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాల హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఎన్నటికీ నెరవేర్చదని అమిత్ షా విమర్శించారు.
మోడీ చేసిన వాగ్దానాలు తప్పకుండా అమలు చేస్తారు అని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో దేశం సురక్షితంగా ఉందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కలిసి మజ్లిస్‌ను అడ్డుకోగలవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య త్రికోణ బంధం ఉందన్నారు. మూడు పార్టీలు హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించరని మండిపడ్డారు. మూడు పార్టీలు సీఏఏను వ్యతిరేకించాయని, రద్దు చేసిన ట్రిపుల్ తలాక్ పునరుద్ధరణకు యత్నిస్తున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు.
The people of Telangana are ready to bless the PM Modi-led BJP with more than 10 Loksabha seats. They are fed up with the Congress party's politics of corruption & appeasement. Pictures from the public rally in Bhongir (Telangana). pic.twitter.com/IQmNT4TL0z
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) May 9, 2024
అమిత్ షా కీలక హామీలు
భువనగిరి టెక్స్టైల్ పరిశ్రమల కోసం ప్రధాని మోడీ కృషి చేశారని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. కొత్త టెక్స్ టైల్ విధానంతో 8 లక్షల మంది చేనేత కార్మికులకు ఉపాధి లభించనుందన్నారు. రూ.1,500 కోట్లతో జాతీయ టెక్స్ టైల్ విధానం అమల్లోకి తెచ్చామని వివరించారు. రూ.14 వేల కోట్లతో పోచంపల్లిలో టెక్ స్టైల్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ నిర్మించి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు.
జనగాం నుంచి భువనగిరి వరకు రైల్వే లైన్ల ఆధునీకరణ చేపట్టామని, కొమురవెల్లిలో అత్యాధునిక రైల్వేస్టేషన్ నిర్మిస్తున్నామని అమిత్ షా వెల్లడించారు. రాయగిరి నుంచి వరంగల్ వరకు 4 వరుసల రహదారి నిర్మించామని వివరించారు. దేశం అభివృద్ధి వైపు పయనించాలంటే మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. తెలంగాణ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అమిత్ షా కోరారు.












Click it and Unblock the Notifications