తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారు: షెడ్యూల్ ఇదే
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 12న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రానున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 11 గటంలకు బీజేపీ మూడు వేల మందితో నిర్వహించే సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరుకానున్నారు. అమిత్ షా రాష్ట్రానికి రానుండటంతో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పని చేయాలి?, ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి?, ప్రజలను ఆకర్షించేలా పోస్టులపై దిశా నిర్దేశం చేయనున్నారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. ఈ సమావేశానంతరం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. 25 వేల మంది బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలు ఈ సమావేశానికి రానున్నారు.

గ్రామాల్లో ప్రతి బూత్‌లో 370 ఓట్లు వచ్చేలా కృషి చేయాలని బూత్ అధ్యక్షులకు అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారు. అదేరోజు సాయంత్రం 17 పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్‌తో సమావేశమవుతారు అమిత్ షా. పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్ సమావేశంలో భాగంగా దాదాపు ఐదు వందల మందితో సమావేశమై పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా పని చేయాలి? పార్టీ విజయానికి కృషి చేయాల్సిన కీలక అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.
ఇది ఇలావుండగా, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పంపకాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి వరకు చర్చించిన నేతలు.. మళ్లీ శుక్రవారం కూడా ఈ విషయంపై భేటీ అయ్యారు. ఈరోజు అసెంబ్లీ, ఎంపీ సీట్ల పంపకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications