జయజయహే తెలంగాణా.. ఆంధ్రా కీరవాణితోనా.. చారిత్రక తప్పిదం: సీఎం రేవంత్ రెడ్డికి లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ వారు లేఖ రాశారు. అందెశ్రీ గారు రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి దానిని విడుదల చేయబోతున్నందుకు తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
జయజయహే తెలంగాణా.. కీరవాణి డైరెక్షన్ చేస్తే ఎలా
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా విడుదల చేయనున్నట్టు పేర్కొన్న తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఇంత గొప్ప పాటకు సంగీత దర్శకులు కీరవాణి గారి సంగీతాన్ని అందించమని కోరడం చారిత్రక తప్పిదం అవుతుందని పేర్కొన్నారు.

తెలంగాణా అస్తితం గురించి రేవంత్ కు లేఖ
తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదని, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో మీకు తెలియంది కాదని, మన ఉద్యోగాలు మనకే రావాలి, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది అని గుర్తు చేశారు. సకల జన సహకారంతో ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు.
పక్క రాష్ట్రాల వాళ్ళతో పాడించటం అవమానించటమే
ఇంతటి ఖ్యాతి గడించిన మన తెలంగాణ రాష్ట్ర గీతానికి, పక్క రాష్ట్రాల వారు సంగీతం సమకూర్చి పాడడం అంటే మన తెలంగాణ కళాకారులను అవమానించడమేనని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహిస్తారు అని సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ కోరుతుంది అన్నారు.ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని, మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి వారిని గౌరవిస్తారని ఆశిస్తున్నామన్నారు.
ఈ చారిత్రక గీతాన్ని ఒక చారిత్రక తప్పిదంగా చెయ్యొద్దు
అలాగే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఒక బృంద గానంగా పాడించి విడుదల చేస్తే మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గీతంలా గౌరవించబడుతుంది అనేది తమ అభిప్రాయం అన్నారు. ఇది తమ సలహా మాత్రమేనని ఈ చారిత్రక గీతాన్ని ఒక చారిత్రక తప్పిదంగా చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటున్నాం అంటూ విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం ఈ గేయాన్ని నిర్లక్ష్యం చేసింది
అంతేకాదు ఈ గీతాన్ని పదేళ్ల క్రితం గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలకు అందిస్తే బాగుండేదని, కానీ గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసిందని ఈ పాటను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైంది అని, అలాంటి పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకుల కబంద హస్తాల్లో నలిగి నలిగి చచ్చిపోయింది అన్నారు.
మీ ఆలోచన గొప్పదే కానీ ఆంధ్రా వాళ్ళతో పాడిస్తే తప్పే
మళ్లీ మీ వల్ల పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణంలో పాటను బతికిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. అయితే ఆంధ్రకు చెందిన కీరవాణితో మ్యూజిక్ డైరెక్షన్ చేయించడం, పాట పాడించడం మాత్రం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications