
తెలంగాణలో మరో బై పోల్- బీజేపీలోకి కోమటిరెడ్డి : అమిత్ షా హామీ..!!
తెలంగాణలో మరో ఉప ఎన్నిక దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వచ్చిన జోష్.. హుజూరాబాద్.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం పైన ఆశలు పెట్టుకుంది. దీంతో..ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసింది. అందులో భాగంగా.. చాలా రోజులుగా కాంగ్రెస్ వీడి బీజేపీ లో చేరుతారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి పైన ప్రచారం సాగుతోంది. అయితే, ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నారు.

కాంగ్రెస్ కు కోమటిరెడ్డి హ్యాండ్
టీపీసీసీ చీఫ్ రేవంత్ తో కోమటిరెడ్డి సోదరుల మధ్య గ్యాప్ ఉంది. ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధినాయకత్వంతో ఉన్న సంబంధాల తో తనకు తానుగా పార్టీలో బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, రాజగోపాల్ రెడ్డి చాలా రోజులుగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా, ఆయన కాషాయం కండువా కప్పుకొనే ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో రాజగోపాల్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని ఆయన నిర్దారించారు. జార్ఖండ్‌లోని గోడా నియోజకవర్గ ఎంపీ నిషికాంత్ దూబే తో పాటుగా రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోం మంత్రిని కలిసారు. ఆ సమయంలోనే అమిత్ షా వచ్చే నెల మొదటి వారంలో వరంగల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

అమిత్ షాతో భేటీ - బై పోల్ దిశగా
ఆ సభలోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరటానికి సిద్దమయ్యారని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి తన పార్టీ మార్పు పైన కేసీఆర్ ను ఓడించే పార్టీలోకే వెళ్తామని చెబుతూ వచ్చారు. బీజేపీలో చేరేముందే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అమిత్ షా నిర్దేశించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే త్వరలోనే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. దీని ద్వారా త్వరలోనే మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మునుగోడులో ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి గెలుపు కష్టం కాదనే అభిప్రాయం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నికల ద్వారా టీఆర్ఎస్ ముఖ్య నాయకత్వానికి రాజకీయంగా చెక్ పెట్టాలనేది బీజేపీ ప్రయత్నం.

కోమటిరెడ్డి సత్తా చాటేనా
అయితే, స్థానికంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు నల్గొండ జిల్లాలో పట్టు ఉంది. ఈ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడికి మద్దతుగా నిలుస్తారా లేదా అనేది మరో చర్చ. అయితే, టీఆర్ఎస్ ఇప్పటికే ఈ పరిణామాలను అంచనా వేసి..సర్వేలు సైతం చేయించినట్లుగా తెలుస్తోంది. ఎక్కడ ఏ ఎన్నిక అయినా.. అసెంబ్లీ ఎన్నికలకు అయినా తాము సిద్దమేనని గులాబీ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో తాము రాజకీయంగా ముందుడుగు వేయటం ద్వారా కేసీఆర్ ను రాష్ట్రానికే పరిమితం చేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో..తెలంగాణలో మరోసారి ఉప ఎన్నిక వస్తే..రాజకీయంగా మరింత వేడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.