పోలీస్ స్టేషన్ అంటే భయంలేకుండా చేస్తా: పూర్తిస్థాయి డిజిపిగా అనురాగ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డిజిపి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)గా అనురాగ్ శర్మ నియమితులయ్యారు. పూర్తిస్థాయి డిజిపిగా అనురాగ్ శర్మను నియమిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్లర చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అనురాగ్ శర్మ తాత్కాలిక డిజిపిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనురాగ్ శర్మను పూర్తిస్థాయి డిజిపిగా నిర్ణయించినందున ఆయనకు పలువురు అధికారులు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. పూర్తిస్థాయి డిజిపి రేసులో అనురాగ్ శర్మతో పాటు మరో నలుగురు ఉన్నారు. అయితే, అనురాగ్ శర్మ వైపే మొగ్గు చూపారు. మరోవైపు, అనురాగ్ శర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను సచివాలయంలో కలిశారు.

అలాగే, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీగా కరుణాకర్ రెడ్డిని నియమించారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు వచ్చే ఏడాది నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. పెండింగ్ మెస్ ఛార్జీలను రూ.7 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.
సామాన్యుడికి పిఎస్ అంటే భయం లేకుండా చేస్తా: డిజిపి
సామాన్యుడికి పోలీస్ స్టేషన్ అంటే భయం లేకుండా చేస్తానని డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. మావోయిస్టుల ప్రభావం లేదని, వారి దాడులను సమర్థవంతంగా తిప్పికొడతామని చెప్పారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. పూర్తిస్థాయి డిజిపిగా నియమితులవడం తనకు సంతోషాన్నిస్తోందన్నారు.
బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై సీఎస్ సమీక్ష
ఖమ్మం జిల్లాలో నిర్మించ తలపెట్టిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాట్ల పైన శుక్రవారం సీఎస్ రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సెయిల్, సింగరేణి, ఎన్‌ఎండీసీ అధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications