నో ఛాన్స్: పోలవరం విలీన గ్రామాలపై మాదే అధికారమన్న ఏపీ.. భద్రాచలం కోసం పట్టు?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అమరావతి/ హైదరాబాద్: ఇటీవల ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో విలీనం చేసిన మండలాల్లో కొన్ని తిరిగి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందని సాక్షాత్ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురయ్యే గ్రామాలను వెనక్కి ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్‌ సుముఖంగా లేదు. అంతే కాదు తాజాగా సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం భద్రాచలం పట్టణం కూడా కావాలని పట్టుబడుతోంది.
రాష్ట్ర పునర్వవ్యవస్థీకరణ చట్టం రూపొందించినప్పుడు ముంపు గ్రామాల విషయమై ద్రుష్టి సారించలేదు. తెలంగాణ విభజన కోసం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించింది. కలిపిన ముంపు గ్రామాల విషయంలో ఏపీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకూ పునరాలోచించిన దాఖలాలు లేవు.

ఏపీ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య కీలక పాత్ర

ఏపీ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య కీలక పాత్ర

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పెట్టిన సందర్భంలోనే ముంపు గ్రామాల విలీనం అంశం తెరపైకి వచ్చినా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రాగానే పోలవరం గ్రామాలను ఏపీలో కలుపుతూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినా తెలంగాణ నుంచి ఎటువంటి వ్యతిరేకత రాక పోవటం గమనార్హం. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా తమ గ్రామాలను ఏపీలో విలీనం చేశారంటూ భద్రాచలం నియోజకవర్గ ఆదివాసీలు అప్పట్లో నిరసన వ్యక్తం చేశారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. ముంపు గ్రామాల విలీనం వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ నేత, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చక్రం తిప్పారు.

వెనక్కు ముంపు గ్రామాలపై వెనక్కిపై భిన్న స్వరాలు

వెనక్కు ముంపు గ్రామాలపై వెనక్కిపై భిన్న స్వరాలు

ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి వేరు చేస్తే పోలవరం ప్రాజెక్టుకు సాంకేతికంగా ఎటువంటి అడ్డంకులూ ఉండవని, పునరావాస కార్యక్రమాలను కూడా తామే చేపట్టవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు భావించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 208 గ్రామాలను ఏపీలో విలీనం చేసింది. కానీ తెలంగాణ ఇస్తే చాలని భావించిన టీఆర్‌ఎస్‌ ముంపు మండలాల విషయంలో ఎటువంటి ఆందోళన చేయక పోవటం విశేషం. ముంపు గ్రామాలను మళ్లీ వెనక్కి ఇచ్చే విషయం కేంద్రం పరిశీలనలో ఉన్నదని రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై ముంపు ప్రాంతంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ఏపీలో విలీనం చేసినా నోరు మెదపని కేసీఆర్

ఏపీలో విలీనం చేసినా నోరు మెదపని కేసీఆర్

తమ గ్రామాలను విలీనం చేసి ఇప్పటికే మూడున్నరేళ్లు గడచిందని, ఏపీలో టీచర్‌ ఉద్యోగాలు, తదితర నియామకాలు జరుగుతున్న తరుణంలో తమను మళ్లీ తెలంగాణలో కలపాలనడం సమంజసం కాదన్నారు. ముంపు ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు కూడా తెలంగాణకు వచ్చేశారు. పోలవరం గ్రామాలను ఏపీలో కలపవద్దని తాము ఆందోళన చేసినప్పుడు కేసీఆర్‌ నోరు మెదపలేదని, ఒకరిద్దరు ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించినప్పటికీ కేంద్రంపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి తీసుకు రాలేదని ముంపు ప్రాంతాల వారంటున్నారు. కొద్దిమంది తెలంగాణ వాదులు మాత్రం ఈ గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. గవర్నర్‌ సమక్షంలో ఇద్దరు సీఎంలు సమావేశమై నప్పుడు విలీన గ్రామాల అంశం చర్చకు వచ్చిందని తెలిసింది. పాలనా సౌలభ్యం కోసం ముంపు గ్రామాలు తెలంగాణలో ఉంటే బాగుంటుందని కేసీఆర్‌ అన్నా, చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిసింది.

సహాయ, పునరావాస చర్యలపై ఏపీ సన్నాహాలు

సహాయ, పునరావాస చర్యలపై ఏపీ సన్నాహాలు

పోలవరం ముంపు గ్రామాల్లో పునరావాస కార్యక్రమాలు అమలు చేయటానికి రూ. 10 వేల కోట్లు ఖర్చవుతుందని ఏపీ అధికారులు అంచనా వేశారు. పునరావాస కాలనీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా కేంద్ర నిధులతో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు చేయటానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ముంపు ప్రాంతంలో భూసేకరణ జరుగుతున్నది. ఈ దశలో ఈ గ్రామాలను వెనక్కి ఇవ్వాలనే ప్రతిపాదన తమ వద్ద లేదని ఏపీ అధికారులు తెలిపారు. ఇప్పటికే గ్రామసభల ఆమోదంతో పునరావాస కార్యక్రమాలు అమలు చేయటానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు వారు చెప్పారు.

ఏపీలో రకరకాలుగా ఖమ్మం జిల్లా మండలాల విలీనం

ఏపీలో రకరకాలుగా ఖమ్మం జిల్లా మండలాల విలీనం

విలీనంలో భాగంగా తెలంగాణలో ఉంచిన భద్రాచలం పట్టణాన్ని ఏపీలో కలపాలనే వాదన కొత్తగా తెరపైకి వచ్చింది. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కూనవరం, వీఆర్‌ పురం, చింతూరు, భద్రాచలం మండలాలను తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. నిజాంనవాబుల కాలంలో భద్రాచలం దేవాలయం నిర్మాణం చేసినందువల్ల భద్రాచలం పట్టణాన్ని మాత్రమే తెలంగాణలో ఉంచారు. అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను పూర్తిగానూ, బూర్గంపాడు మండలాన్ని పాక్షికంగానూ పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. భద్రాచలం పట్టణానికి ఇరువైపుల ఉన్న గ్రామాలు ఏపీలోకి విలీనం కాగా పట్టణం మాత్రమే తెలంగాణలో ఉండటంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అంతరాష్ట్ర రవాణా, పన్నుల వసూలు సరిహద్దుల సమస్యలు ఎదురవుతున్నందున ఈ పట్టణాన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపాలని కోరింది. దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

తెలంగాణలో ఎమ్మెల్యే.. ఏపీలో విలీన గ్రామాలు

తెలంగాణలో ఎమ్మెల్యే.. ఏపీలో విలీన గ్రామాలు

పోలవరం ముంపు మండలాలు, గ్రామాలను ఏపీలో కలిపిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల గందరగోళం కొనసాగుతున్నది. భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాలు తెలంగాణలో ఉండగా ఈ రెండు నియోజకవర్గాల్లోని సగం భూభాగం ఏపీలో కలపటంతో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల శాసనసభ్యులు తెలంగాణ అసెంబ్లీకే ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన గ్రామాల ప్రజల సమస్యలపై నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగక పోతే ఈ సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Merger villages are faces so many problems. MLA's in Telangana and people are settled in Andhra Pradesh. Recently KCR announced in assembly that AP will give some villages to Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి