కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన..విస్తృత ఏర్పాట్లు!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని రేపు దర్శించుకోనున్నారు. ఉదయం 10:30-11:30 మధ్య, రూ.35.19 కోట్ల టీటీడీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. గతంలో కొండగట్టు అంజన్న ఆలయం భక్తుల వసతి కష్టాలను గమనించి ఇచ్చిన హామీ మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుల సహకారంతో ఈ నిధులు మంజూరయ్యాయి.
కొండగట్టులో భారీ సత్రం, ప్రత్యేక మండపం శంకుస్థాపన చేయనున్న పవన్
ఈ నిధులతో కొండగట్టులో 96 గదుల భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భక్తిభావం, సహకారానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయ అభివృద్ధి ప్రాజెక్ట్ కు శంకుస్థాపన అనంతరం పవన్ కళ్యాణ్, కొడిమ్యాలలోని బృందావనం రిసార్టులో తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.

జనసేన బలోపేతంపై చర్చ
తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్ ప్రణాళికతో పాటు, పంచాయతీ ఎన్నికల విజేతలపై చర్చిస్తారు. ఈ పర్యటనలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఏపీ విప్ పిడుగు హరిప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి వంటి ప్రముఖులు పవన్ కళ్యాణ్ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. JNTU హెలిప్యాడ్ నుండి దేవస్థానం వరకు భద్రత, ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా సభా స్థల ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.
పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం
జిల్లా కలెక్టర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయు ప్రదేశాన్ని పరిశీలించారు. గుడి ఆవరణ ప్రదేశంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications