ఇప్పుడు విదేశాలకు పోవుడేందిరా భయ్.!కోవర్టు రెడ్డి అంటాన్రు.!కోమటిరెడ్డి తీరుపై పెదవి విరిస్తున్న విహెచ్.!
హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్ళక పోవడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంత రావు. అన్న దమ్ములు వేరు వేరు పార్టీల్లో ఉండటం కొత్త కాదని, అంత మాత్రాన రాజకీయంగా పరస్పర సహకారం ఉండదని అన్నారు. తాను ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకునే వెంకట్ రెడ్డి ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారని వి హనుమంత రావు సూటిగా ప్రశ్నించారు.

స్టార్ క్యాంపెయినర్ గా ఉండి విదేశాలకు ఎట్ల పోతరు..
స్టార్ క్యాంపెయినర్ గా ఉండి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవడం విమర్శలకు తావిస్తోందని వి.హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు వెంకట్ రెడ్డి విదేశాలకు వెళ్ళడం సరికాదన్నారు. ఇలాంటి ప్రవర్తన వల్ల టీఆర్ఎస్ నేతలు కోవర్ట్ రెడ్డి అంటున్నారని వి.హనుమంత రావు ఆందోళన వ్యక్తం చేసారు. వెంకట్ రెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్ళక పోతే, కోవర్ట్ రెడ్డి అనేది నిజమౌతుందని వి.హనుమంత రావు పేర్కొన్నారు.

కోవర్ట్ రెడ్డి అంటున్నారు..
వెంకట్ రెడ్డి ప్రవర్తన వల్ల ఆయన ఇంటి పేరు కూడా మారుతుందన్నారు. తాను వెంకట్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసినా ఫలితం లేదన్నారు. తన ఫోన్ అందుబాటులో లేదని, అందుబాటులోకి వచ్చినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు విహెచ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు మార్చుకోవాలని చేతులు జోడించి అడుగుతున్నానన్నారు వి.హనుమంత రావు. ఇదిలా ఉండగా గత వారం టీపిసిసి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి విదేశాలకు వెళ్లారు.

కోమటిరెడ్డి విదేశీ పర్యటన..
విదాశాలకు వెళ్లే ముందకు ఏఐసిసి, పీసిసి అనుమతి తీసుకున్నప్పటికీ పార్టీలో మాత్రం ఆయన పర్యటన పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం దగ్గర పడుతుండడం, బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుండంతో కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది. మునుగోడులో తీవ్ర ప్రభావం చూపించే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి లోటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

కోమటి రెడ్డి వెంటనే ప్రచారానికి రావాలి..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరుతో ఎన్నో వదంతులు వ్యాపిస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీలో వివాదాలకు ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలని ప్రతిపక్షాలు హేలన చేస్తున్నాయని వి.హనుమంత రావు స్పష్టం చేస్తున్నారు. పార్టీ ప్రచారాన్ని మొత్తం పీసిసి అద్యక్షుడు బుజాన వేసుకుని నిర్వహిస్తున్నా, కోమటి రెడ్డి లాంటి స్థానిక నాయకుడి అవసరం ఎంతో ఉంటుందనే అభిప్రాయాన్ని వి.హనుమంత రావు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications