పీఈసీ సమావేశంలో రేవంత్, ఉత్తమ్ తీవ్ర వాగ్వాదం: సీటు త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో మరోసారి భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. గాంధీభవన్‌లో మంగళవారం జరిగిన పీఈసీ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీలో ఒకే కుటుంబంలో రెండు టికెట్ల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. మాట మాట పెరిగి సమావేశం నుంచి ఉత్తమ్ ఆగ్రహంతో వెళ్లిపోయారు.
కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభర్థులుగా పోటీ చేసేందుకు ఆసక్తిచూపుతున్న ఆశావాహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆశావాహుల జాబితాను స్క్రూట్నీ చేసేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. దాదాపు మూడున్నర గంటలపాటు కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన స్థానాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపై రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు అభ్యర్థుల అంశంపై పీసీసీ అధ్యక్షుడు ప్రతిపాదన చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టినట్లు తెలిసింది. ఒకే కుటుంబంలో రెండు టికెట్లపై తాను ఎలాంటి ప్రతిపాదన చేయబోనని, అంతా పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పస్టం చేసినట్లు సమాచారం.
అయితే, ఈ అంశంపై హైకమాండ్‌కి పీసీసీ అధ్యక్షుడే చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దీంతో తనను డిక్టేట్ చేయవద్దని రేవంత్ రెడ్డి బదులిచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కాగా, అభ్యర్థుల విషయంలో ఎలాంటి స్పష్ట రాకపోవడంతో సెప్టెంబర్ 2న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
బీసీల కోసం సీటు త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ నియోజకవర్గానికి ఆరు అప్లికేషన్లు వచ్చాయని.. అవసరమైతే తాను బీసీల కోసం తన స్థానాన్ని త్యాగం చేస్తానని కోమటిరెడ్డి చెప్పారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీసీలకు సీటు ఇవ్వాలన్నారు. అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేయొద్దని సమావేశంలో చెప్పినట్లు తెలిపారు.
మొదట్నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో తాను చెప్పినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. డిక్లరేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు. మరో నాలుగైదు రోుల్లో మళ్లీ సమావేశం ఉంటుందని.. సర్వే ఆధారంగా స్క్రీనింగ్ కమిటీలో చర్చించి సీట్లు ఖరారు చేస్తామన్నారు. బీఆర్ఎస్‌లా కాకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా టికెట్లు కేటాయిస్తామన్నారు. సెప్టెంబర్ రెండు మూడు వారాల్లో అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అవుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications