కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రసాభాసగా కరీంనగర్ జడ్పీ సమావేశం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: జిల్లా ప్రజా పరిషత్‌ తొలి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. రుణ మాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ అంశాలపై సభలో దుమారం రేగింది. కాంగ్రెస్‌, టిఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరగడం, టిఆర్‌ఎస్‌ సభ్యులు తమ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమెల్యే టి జీవన్‌ రెడ్డి సహ ఆ పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు. జడ్పీ ప్రధాన ద్వారం ముందు అగౌరవ పరిచిన సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు.

కొద్దిసేపటికి సభ నుంచి వచ్చిన టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, రసమయి బాలకిషన్‌లు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, సభ్యులకు నచ్చజెప్పి తిరిగి సభలోకి తీసుకెళ్లారు. సభలో జడ్పీటీసీ సభ్యుడు క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా సభ్యులు హుందాగా వ్యవహరించాలని, సభా మర్యాదలను కాపాడాలని మంత్రి ఈటెల రాజేందర్‌ హితవు పలికారు. దాదాపు ఆరున్నర గంటల పాటు జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్‌అండ్‌బీ శాఖల పని తీరుపై వాడీవేడిగా చర్చ జరిగింది. బీఆర్‌జీఎఫ్‌ నిధులతో చేపట్టే పనులకు, తదితర పనులకు ఆమోదం తెలిపారు.

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. శుక్రవారం మధ్యాహ్నాం జడ్పీ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్‌ తుల ఉమ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ హాజరయ్యారు. వ్యవసాయ శాఖపై చర్చ జరుగుతుండగా ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ..రుణమాఫీ పథకం సంబంధించి కౌలు రైతులకు లాభంచేయని నిబంధనలు జోడించారని, వాటిని తొలగించాలని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు.

రుణమాఫీపై స్పష్టతలేదని ఓవైపు జీవన్ సునిశిత విమర్శలు కూడా చేస్తూ, బ్యాంకులు ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వకుండా పాత అప్పులకు జమ కడుతున్నాయని ఆరోపించారు. దీనికి మంత్రి ఈటెల సమాధానం చెబుతూ రీ షెడ్యూల్ చేసిన రుణాలను మాఫీచేస్తామని చెప్పకున్న రైతుల అవసరాన్ని గుర్తించి ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని గుర్తుచేశారు. అయితే, జీవన్‌రెడ్డి రీ షెడ్యూల్ రుణాలు, ముగిసిన పంట కాలం రుణాలు అంటూ ఉత్తర్వుల్లో మెలిక ఉందని, దీని వల్ల రైతుల పంట రుణాలు టర్మ్ లోన్ కింద రావడంలేదని ఎత్తిచూపారు. కౌలురైతులకు రుణమాఫీ లభించకుండా వన్-బి వెరిఫికేషన్ చేయడం సరికాదని విమర్శించారు.

దీంతో మంత్రి ఈటెల కల్పించుకుని సాధ్యమైనంతవరకు అందరికి లాభం జరిగేలా 28వేల కోట్ల రూపాయలు రుణమాఫీని చేస్తున్నామని, ఒక సంవత్సరం ప్రణాళికేతర వ్యయాన్ని కూడా పక్కన పెట్టాలని సిఎం చిత్తశుద్ధితో ఉన్నారని, ఇందులో ఏలాం టి అనుమానంలేదన్నారు. జిల్లాలో 1,680కోట్ల రూపాయలు రుణమాఫీ జరుగుతున్నదని వివరించారు. అయితే, జీవన్‌రెడ్డి ఇదే విషయంపై మరోమారు కౌలుదారు రైతులకు వర్తిస్తుందని స్పష్టమైన ప్రకటన చేయాలని ఆర్థిక మంత్రిపై ఒత్తిడి తెచ్చారు.

జడ్పీ సమావేశం

జడ్పీ సమావేశం

జిల్లా ప్రజా పరిషత్‌ తొలి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. రుణ మాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ అంశాలపై సభలో దుమారం రేగింది.

జడ్పీ సమావేశం

జడ్పీ సమావేశం

కాంగ్రెస్‌, టిఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరగడం, టిఆర్‌ఎస్‌ సభ్యులు తమ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమెల్యే టి జీవన్‌ రెడ్డి సహ ఆ పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు.

జడ్పీ సమావేశం

జడ్పీ సమావేశం

జడ్పీ ప్రధాన ద్వారం ముందు అగౌరవ పరిచిన సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు.

జడ్పీ సమావేశం

జడ్పీ సమావేశం

శుక్రవారం మధ్యాహ్నాం జడ్పీ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్‌ తుల ఉమ అధ్యక్షతన సమావేశం జరిగింది.
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు.

అలాగే జిల్లాకు 108కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసిన కేవలం 18కోట్లు మాత్రమే పంపిణీ చేశారని జీవన్‌రెడ్డి విమర్శించారు. దీంతో శంకరపట్నం జడ్పీటిసి సంజీవరెడ్డి మీ ప్రభుత్వ హయాంలో నష్టం జరిగితే, ఆ రోజు నష్టపరిహారం ఇప్పించుకోలేని మీరు ఈ రోజు ఆ నష్టపరిహారాన్ని ఇచ్చినప్పటికీ కూడా విమర్శలుచేయడం భావ్యంకాదని విరుచుకుపడ్డారు. హుజురాబాద్ నియోజకవర్గం టిఆర్‌ఎస్ జడ్పీటిసిలు, ఎంపిపిలు ఒక దశలో జీవన్‌రెడ్డితో వాగ్వాదానికి దిగేందుకు ప్రయత్నించగా మంత్రి వారించారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు కల్పించుకుని ఇన్‌పుట్ సబ్సిడీ, బ్యాంకు రుణాల్లో పెద్దమొత్తంలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్రమంగా లబ్దిపొందేందుకు కుట్రలు చేస్తున్నారని, ముందు ఈ జాబితాను సునిశితంగా పరిశీలించి అర్హులకే లబ్ది కలిగించాలని డిమాండ్ చేశారు.

ఇన్‌పుట్ సబ్సిడీ, వ్యవసాయ రుణాలపై సిఐడితో విచారణ జరిపించి అసలైన రైతులను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బెజ్జంకి జడ్పీటిసి తన్నీరు శరత్‌రావు మాట్లాడుతూ.. బెజ్జంకిలో వ్యవసాయాధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పేదలకు చెందాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని బ్రోకర్లకు, దొంగలకు లబ్దిచేకూరేలా చేస్తున్నారని, వీటన్నింటిని సవరించి నిజమైన లబ్దిదారులకు సొమ్ము అందేలా మా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని చెబుతూ, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాత్రం తన కార్యకర్తలకు ఎంత వీలైంత అంత డబ్బులు ఇప్పించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని దుయ్యబట్టారు.

జీవన్‌రెడ్డి తనపై వచ్చిన విమర్శకు స్పందించేందుకు మైక్‌ను ఇవ్వాల్సిందిగా జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమను కోరారు. అయితే, అదే సమయంలో టిఆర్‌ఎస్‌కు చెందిన జడ్పీటిసిలు తోట ఆగయ్య, సంజీవరెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, ఎడ్ల సుగుణాకర్, అరికాల వీరేశలింగం, కాల్వశ్రీరాంపూర్ ఎంపిపి సారయ్యలు కాంగ్రెస్ పాలన తీరును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం, దీనికి కాంగ్రెస్ జడ్పీటిసిలు నారాయణరెడ్డి, జంగిలి సునీత వెంకట్, వీరబత్తిని శోభారాణి, యాట దివ్య, శరత్, సదానందం లేచి జీవన్‌రెడ్డికి బాసటగా నిలిచారు. మైక్ ఇవ్వకపోవడంతో జడ్పీ సమావేశ మందిరాన్ని వదిలి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేలు పుట్ట మధు, గంగుల కమలాకర్ కల్పించుకుని సీనియర్ సభ్యులైన మీరు సభ నుంచి వెళ్లిపోవద్దని కోరారు. ఒక దశలో ఈటెల రాజేందర్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ.. జీవన్‌రెడ్డిని బ్రతిమిలాడారు.

మరోవైపు టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు గొడవ పడుతూనే ఉన్నారు. ఇదే సమయంలో మరోసారి పుట్ట మధు కల్పించుకుని జీవనన్నా.. ఇన్‌పుట్ సబ్సిడీ అక్రమాలు, రుణమాఫీ అంశంపై విచారణ జరిగితే అక్రమాలు బయటకు వస్తాయని పోతున్నారే, ఇది మంచిది కాదు, రైతు పక్షపాతివి నువ్వు అలా పోవద్దంటూ దగ్గరికొచ్చి తీసుకెళ్లి సీట్లో కూర్చుండబెట్టారు. అనంతరం సభను ఉద్దేశించి ఈటెల రాజేందర్, తుల ఉమ మాట్లాడినా, పరోక్షంగా టిఆర్‌ఎస్ జడ్పీటిసిలను ప్రోత్సహిస్తూ, మరోవైపు గత పాలన తీరును కూడా ఎండగడుతూ వ్యాఖ్యలు చేశారు.

ఏది ఏమైనా శరత్‌రావుతో క్షమాపణలు చెప్పించేందుకు ఈటెల ప్రయత్నం చేస్తూనే ఉండగా, జీవన్‌రెడ్డి సమావేశ మందిరాన్ని మరోసారి వదిలిపెట్టి బయటకువచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ జడ్పీటిసిలు, ఎంపిపిలు బయటకు నడిచారు. అనంతరం జడ్పీ గుమ్మం ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు. చివరకు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయటకువచ్చి జీవన్‌రెడ్డిని, జడ్పీటిసి, ఎంపిపిలను బ్రతిమిలాడి సభలోకి తీసుకువెళ్ళి శరత్‌రావుతో క్షమాపణలు చెప్పించారు. దీంతో సభలో వేడి చల్లారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, బొడిగె శోభ, వొడితెల సతీష్‌కుమార్, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు టి. సంతోష్‌కుమార్, పాతూరి సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, సిఇఓ సదానందం, జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Argument continued Between TRS and Congress in ZP Meeting at Karimnagar on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X