ఆరోగ్య శ్రీ సేవలు బంద్..! బకాయిలు చెల్లిస్తేనే వైద్యం అంటున్న హాస్పటల్ యాజమాన్యాలు..!!
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్య శ్రీ పథకం పట్ల నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు తడిసి మోపెడవడంతో ఆసుపత్రులు చేతిలెత్తేసే పరిస్ధితులు తలెత్తాయి. ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ నెల 16 నుంచి తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. గత ఏడాదిన్నరగా ఈ సొమ్ము చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు బకాయి పడినట్లు సమాచారం కాగా తమకు రావాల్సింది 1500 కోట్ల రూపాయలని అసోసియేషన్ చెబుతుండగా కాదు, 800 కోట్ల రూపాయలేనని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

ఆరోగ్యశ్రీ సేవలకు ఆటంకం..! ఉద్యోగ, పాత్రికేయుల వైద్య సేవలూ నిలిపివేత..!!
హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికే ప్రభుత్వం ఏకంగా 70 కోట్లు రూపాయలు చెల్లించాల్సి ఉందని సమాచారం. బకాయిలు చెల్లిస్తామంటూ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో అసోసియేషన్ పేర్కొంది. బకాయిల విడుదల విషయమై నేడు ఆరోగ్యశాఖ మంత్రి ఈటలతో పాటు ఆరోగ్యశ్రీ సీఈవోను కలవనున్నట్టు అసోసియేషన్ ముఖ్యులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ కింద 330 ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయి.

1500 కోట్ల బకాయిలు..! 15లోగా చెల్లించకపోతే సేవలు బంద్..!!
ఇప్పటికే రాష్ట్రంలో పలు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ చికిత్సలను, ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకం(ఈజేహెచ్‌ఎస్) కింద చికిత్సలను అరకొరగా అందిస్తుండగా, ఆ కొద్దిపాటి పరిమిత చికిత్సలకు కూడా ఇక నుంచి ఆటంకం ఏర్పడనుంది. ఆరోగ్యశ్రీ పథకానికి అనుసంధానంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు దాదాపు 1500 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోవడంతో, ఇక ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ చికిత్సలందించడం తమ వల్ల కాదని అవి చేతులెత్తేశాయి. ఈ నెల 10లోగా బకాయిలన్నింటినీ పూర్తిస్థాయిలో చెల్లించని పక్షంలో ఈ నెల 11వ తేదీ నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు, ఈ నెల 15లోగా చెల్లించని పక్షంలో 16వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుసంధాన ఆసుపత్రులు ఆయా పథకాల కింద సేవలన్నింటినీ నిలిపివేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించాయి.

ప్రైవేటు ఆసుపత్రుల ఏకగ్రీవ తీర్మానం..! ఇబ్బంద్దుల్లో రోగులు..!!
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆసుపత్రుల సంఘం(తన్హా) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తన్హా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ తెలిపారు. దీనికి సంబంధించిన వినతిపత్రాన్ని సోమవారం సచివాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారికి, ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో పథకం ముఖ్య కార్యనిర్వహణాధికారికి అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.వైద్య సేవల నిలిపివేతపై తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం(టీషా) ఇప్పటికే ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకు వినతిపత్రం అందజేసింది.

అంత మొత్తం బకాయిలు లేవు..! ఎందుకాలా చెప్తున్నారో అర్ధం కావట్లేదంటున్న అదికారులు..!!
మొత్తం 1500 కోట్ల బకాయిల్లో టీషాకు చెల్లించాల్సినవే సుమారు 800 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ వర్గాలు మాత్రం 1500 కోట్ల రూపాయలు బకాయిలు లేవని, రెండు పథకాలకు కలుపుకొని టీషా, తన్హాలకు సుమారు 800 కోట్ల రూపాయలు వరకు చెల్లింపులు జరపాల్సి ఉందని చెబుతున్నాయి. ఈ వారంలోనే సుమారు 200 కోట్ల రూపాయలు వరకు విడుదలయ్యే అవకాశాలున్నాయని, దశలవారీగా బకాయిలను చెల్లిస్తామని పేర్కొంటున్నాయి. నిధుల విడుదలలో జాప్యం, ఆసుపత్రులు చికిత్సలు నిలిపివేయడం.. ఈ రెండింటి ఫలితంగా ప్రధానంగా నిరుపేదలు, ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో పైరవీలు చేయించుకుంటే తప్ప చికిత్సలు పొందలేని దుస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications