హైఅలర్ట్.. ఆగస్ట్ 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..!
తెలంగాణలోని ప్రజలకు బిగ్ అలర్ట్.. పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే 'ఆరోగ్య శ్రీ' సేవలు అతి త్వరలో నిలిచిపోనున్నాయి. ఆగస్ట్ 31 అర్థరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్రశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఓ ప్రకటన చేసింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ మేరకు TANHA అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్ మాట్లాడుతూ .. బకాయిల చెల్లింపులో జాప్యం, ఆర్థిక భారం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరిలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే రూ.1300-1400 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపులు గణనీయంగా పెరగడంతో కొన్ని చిన్న ఆస్పత్రులను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. గత జనవరిలో ప్రభుత్వం 4-5 నెలల్లో బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చిందని.. ఆరు నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 471 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయని.. రూ.1300 నుంచి 1400 కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలిపింది. బకాయిలు వెంటనే చెల్లింపులు చేయాలని, ఆరోగ్యశ్రీ ప్యాకేజీలలో సవరణ చేయాలని టీఏఎన్‌హెచ్‌ఏ డిమాండ్ చేస్తోంది. ఆర్థిక భారాన్ని భరించలేక వైద్యులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని అంటున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్ కూడా నిలిచిపోనున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా తక్షణ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు కుదేలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేదల కోసం అమలు చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన పథకం నిలిచిపోతే, పేద రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడవచ్చని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications