ఏపీ ఎన్నికల్లో ఈ నాలుగు వర్గాల ఓట్లే కీలకం
TDP BJP alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం.. మరోసారి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించింది. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరింది. ఈ విషయాన్ని రెండు పార్టీల అధినేతలు అధికారికంగా వెల్లడించారు.
ఆరు సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్డీఏలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టయింది. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం- జనసేన- బీజేపీ మహా కూటమి కట్టాయి. ఉమ్మడిగా బహిరంగ సభలను నిర్వహించబోతోన్నాయి. వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనబోతోన్నాయి.

ఈ పొత్తు వ్యవహారాలపై అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని తప్పు పట్టారు. ఇదే చంద్రబాబు గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టెర్రరిస్ట్‌గా సంబోధించారని గుర్తు చేశారు.
అలాంటి వ్యక్తికి చెందిన పార్టీతో చంద్రబాబు ఎలా పొత్తు పెట్టుకోగలిగారని ఒవైసీ ప్రశ్నించారు. ఆయనను కూర్చోబెట్టి మరీ టీ తాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ అధినాయకుడిని టెర్రరిస్టు అంటూ విమర్శించిన బీజేపీ.. ముస్లిం సామాజికవర్గాన్ని ఉగ్రవాదులతో పోల్చుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
2014లో బీజేపీకి చంద్రబాబు ఎందుకు మద్దతు ఇచ్చారో తెలియదు.. ఆ తరువాత ఎన్డీఏ కూటమి నుంచి ఎందుకు బయటికి వచ్చారో తెలియదని ఒవైసీ వ్యాఖ్యానించారు. అంతకుముందే- కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు మద్దతు ఇచ్చారని, మళ్లీ తెగదెంపులు చేసుకున్నారని గుర్తు చేశారు.

ఏపీలో ఉన్న మైనారిటీలు, ఆదివాసీలు, దళితులు, క్రిస్టియన్లు.. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమికి ఓటు వేయరని ఒవైసీ తేల్చి చెప్పారు. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతుందని అన్నారు. ఈ నాలుగు సామాజిక వర్గాల ఓటు బ్యాంకు నిర్ణయాత్మక శక్తిగా మారిందని పేర్కొన్నారు.
ఈ పొత్తు ప్రభావం.. ఏపీలో గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఒవైసీ అంచనా వేశారు. ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి బీ టీమ్ అంటూ విమర్శిస్తారనని, అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ప్రశంసిస్తారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. సీఏఏపై తన వైఖరేమిటో స్పష్టం చేయాలని నిలదీశారు.
ఏపీలో పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒవైసీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు మంచి మిత్రుడని వ్యాఖ్యానించారు. తమ మధ్య మితృత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications