జూబ్లీహిల్స్ పై అసద్ బిగ్ ట్విస్ట్ - ఫలితం తేలిపోయినట్లేనా...!?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారయ్యారు. బీజేపీ అధికారికంగా తమ అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేయటంతో.. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కాగా, ఇక్కడ ఎంఐఎం పోటీ పైన కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. కాంగ్రెస్ కు ఎంఐఎం పరోక్ష సహకారం అందించే క్రమంలో పోటీకి దూరంగా ఉంటుందని అంచనా వేసారు. అయితే, ఎంఐఎం అధినేత అసద్ చేసిన తాజా వ్యాఖ్యలు ఉత్కంఠ పెంచుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నవీన్ యాదవ్ ను బరిలోకి దించింది. ఇక్కడ నుంచి అనేక మంది ఆశావాహులు సీటు ఆశించారు. అయితే, సీఎం రేవంత్ పట్టుబట్టి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయటంలో కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ ఎంఐఎం విషయంలోనూ రేవంత్ కొంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఎంఐఎం ఇక పోటీ చేయటం లేదని అందరూ భావించారు. దీని పైన బీజేపీ విమర్శలు చేసింది. జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయటం లేదని.. ఎవరి కి మద్దతుగా నిలుస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. జూబ్లీహిల్స్ లో 90 వేలకు పైగా ఉన్న ముస్లిం ఓటింగ్ గెలుపు ఓటముల్లో కీలకంగా మారనుంది. దీంతో, ఎంఐఎం మద్దతు ఉంటే గెలుపు ఖాయమని కాంగ్రెస్ అంచనా వేసింది.

ఇదే సమయంలో ఎంఐఎం అధినేత అసద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ ఉప ఎన్నికల విషయంలో తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు మంచి సంబంధాలున్నాయని ఓవైసీ పేర్కొన్నారు. అయితే, కేవలం ఈ సంబంధాల ఆధారంగా తాము సైద్ధాంతికంగా రాజీ పడలేదని చెప్పారు. కాంగ్రెస్‌తో తమకు ఎటువంటి పొత్తు లేదని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు. తన నియోజకవర్గంలోని మెట్రో లైన్, ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులు, అక్బరుద్దీన్ ఓవైసీ నియోజకవర్గంలోని మురుగునీటి పనుల గురించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు వివరించారు. అయితే, నామినేషన్లు ఈ రోజు నుంచే ప్రారంభం అయ్యాయి. దీంతో.. ఎంఐఎం అధినేత అసద్ - సీఎం రేవంత్ సమావేశం ఒకటి రెండు రోజుల్లో జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమావేశంలో ఎంఐఎం పోటీ అంశం పైన స్పష్టత రానుంది. ఈ నిర్ణయమే జూబ్లీహిల్స్ ఫలితంలో కీలకంగా మారనుంది.












Click it and Unblock the Notifications