హైదరాబాద్‌లో ప్రారంభమైన ఆషాఢ భోనాలు: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు, అమ్మవారికి ప్రార్థనలు
హైదదరాబాద్: నగరంలో ఆషాఢమాస భోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆదివారం ప్రారంభమైన ఆషాఢ బోనాలు ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గొల్కోండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 600 మందికిపైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం లాంటి కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు భక్తులకు సూచిస్తున్నారు.

కాగా, జులై 25, 26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలు, ఆగస్టు 1,2 తేదీల్లో ఓల్డ్‌సిటీ లాల్ దర్వాజా మహంకాళీ అమ్మవారి బోనాలు జరగనున్నాయి.. ఆగస్ట్ 8న గోల్కొండలోనే ఉత్సవాలు ముగియనున్నాయి. ఇప్పటికే బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం 15కోట్ల రూపాయలు విడుదల చేసింది. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు పట్టు వస్త్రాలు సమర్పించారు.
బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ లోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం తెలిపారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం ప్రార్థించారు.












Click it and Unblock the Notifications