గొడవలతో విడిపోయిన అన్నదమ్ములను కలిపిన బలగం సినిమా!!
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బలగం సినిమానే హాట్ టాపిక్ అయింది. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా తెలంగాణ సామాజిక నేపథ్యంతో సాగిన బలగం సినిమా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుంది. కమెడియన్ ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన మరొక కమెడియన్ వేణు వెల్దండి అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం బలగం ప్రజలలో కుటుంబ విలువలను తట్టి లేపుతుంది. ఇక తాజాగా జరిగిన ఒక సంఘటన బలగం సినిమా ప్రభావం ఎంత బలంగా జనాలలో నాటుకుందో అర్థం అయ్యేలా చెబుతుంది.
నిర్మల్ జిల్లాలోని లక్షణ చాందకు చెందిన అన్నదమ్ములు చాలాకాలంగా భూతగాదాలతో విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా ఉన్నారు. అయితే ఇటీవల ప్రతి గ్రామంలోనూ బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ సురకంటి ముత్యం రెడ్డి మండల కేంద్రంలోని డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ సినిమాను గ్రామస్తులంతా చూశారు. అయితే భూమి తగాదాలతో విడిపోయిన అన్నదమ్ములు గుర్రం పోసులు, రవి ఈ సినిమా చూసిన తర్వాత తమ మనసును మార్చుకున్నారు.

సర్పంచ్ సమక్షంలో ఇద్దరు ఒకటయ్యారు. వివాదంలో ఉన్న భూమి సమస్యను పరిష్కరించుకొని ఇకనుంచి తాము కలిసి మెలిసి ఉంటామంటూ చెప్పుకొచ్చారు. తమను కలిపిన గ్రామ సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమా చూసిన తర్వాత తమలో మార్పు వచ్చిందని అన్నదమ్ములు ఇద్దరూ పేర్కొన్నారు. ఇక ఎంతో కాలంగా విడిపోయి ఒకరంటే ఒకరికి పడకుండా దూరంగా ఉన్న అన్నదమ్ములను బలగం సినిమా కలిపిందని చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు గ్రామ సర్పంచ్ సురకంటి ముత్యం రెడ్డి.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బలగం సినిమాపై చర్చ మరింత ఎక్కువైంది. కుటుంబ విలువలకు అద్దం పట్టిన, మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచిన బలగం సినిమా చూసిన తర్వాత చాలామందిలో మార్పు వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి సినిమాలు ప్రస్తుత సమాజానికి అవసరం అని అంటున్నారు.












Click it and Unblock the Notifications