అది డికె అరుణ చరిత్ర, తెలంగాణకి చంద్రబాబు కొర్రీ: సుమన్, మోడీ నుంచి తెండి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే డికె అరుణ, కాంగ్రెస్ నేతలు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బిజెపి పైన టిఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్ సోమవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గద్వాల గడి రాజకీయాలు ఇక చెల్లవన్నారు. జేఎసి నేతలను కొట్టించిన చరిత్ర డికె అరుణది అన్నారు.
తెలంగాణ రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించలేదన్నారు. దానం నాగేందర్ దాదాగిరిని ఇంకా ఎవరు మర్చిపోలేదని చెప్పారు. రైతుల కోసం ధర్నా అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల కొత్త నాటకం అన్నారు. పదేళ్లలో రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదన్నారు.
రైతులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రైతులకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన పదిహేడు నెలల్లో రుణమాఫీతో అన్నదాతను అక్కున చేర్చుకున్నామన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.17 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశామన్నారు. రైతులకు రూ.400 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అధివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందన్నారు.

మిషన్ కాకతీయతో 46 వేల చెరువులను పునరుద్ధరించామని, సమగ్ర జల విదానానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రోడ్డు ఎక్కడం విడ్డూరంగా ఉందన్నారు.
భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. కరెంట్ విషయంలో చంద్రబాబు కొర్రీలు పెడుతుంటే.. కాంగ్రెస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు.
కిషన్ రెడ్డికి సవాల్
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డికి దమ్ముంటే ప్రధాని మోడీ ముందు ధర్నా చేసి తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలన్నారు. ప్రతిపక్షాలు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నాయన్నారు. కొమురం భీం విగ్రహాన్ని జైల్లో పెట్టించిన శ్రీధర్ బాబు ధర్నా చేయడం విడ్డూరమన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!