మూడోవిడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్ట్ 2 నుండి.. బండి సంజయ్ ఏమన్నారంటే!!
మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించడానికి బిజెపి ప్రణాళికను సిద్ధం చేసింది. ఆగస్టు 2వ తేదీ నుండి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే రెండు దఫాలు ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. ఇదే సమయంలో పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని ఇస్తూ బండి సంజయ్ తన పాదయాత్రను కొనసాగించారు. ఇక తాజాగా మరోమారు పాదయాత్ర కు రెడీ అవుతున్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.

యాదగిరిగుట్ట నుండి భద్రకాళీ ఆలయం వరకు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర
ఈసారి మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదగిరిగుట్ట నుండి ప్రారంభించి వరంగల్ భద్రకాళి ఆలయం వరకూ పాదయాత్ర కొనసాగించాలని బండి సంజయ్ నిర్ణయించారు. ఇక మూడవ విడతలో 26 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టనున్నారు. బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏప్రిల్ 14న ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుండి ప్రారంభమై మే 14న తుక్కుగూడ లో బహిరంగ సభ ను నిర్వహించడం ద్వారా ముగిసింది. ఇక గతేడాది బండి సంజయ్ మొదటి విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగింది.

పాదయాత్రతో కెసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్
ప్రజా సంగ్రామ యాత్ర కు ప్రజల నుండి విశేషమైన మద్దతు రావడంతో బండి సంజయ్ మూడో విడత పాదయాత్రను సైతం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, రైతులను రుణమాఫీ విషయంలో మోసం చేసిందని, సాగునీరు అందించే విషయంలోనూ విఫలమైందని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని అతీగతి లేదని ప్రజాక్షేత్రంలో తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించారు. హామీలను నెరవేర్చడంలో టిఆర్ఎస్ పార్టీ విఫలమైందని చెప్పే ప్రయత్నం చేశారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడిన బండి సంజయ్
మూడవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను చేపట్టినట్టు ప్రకటించిన బండి సంజయ్ టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల వ్యూహాలను ప్రజలు గుర్తించి వారిని ఓడించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ మార్గదర్శకం లోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఒకరికొకరు కలిసి పనిచేసిన కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు బీజేపీని ఆపలేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

బీజేపీ మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నాడే కాంగ్రెస్ సిరిసిల్ల సభ
బిజెపి కార్యక్రమాలు చేసే రోజునే కావాలని కాంగ్రెస్ పార్టీ కూడా కార్యక్రమాలను చేపడుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ఆగస్టు 2వ తేదీన మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తుంటే, అదే రోజు కావాలని కాంగ్రెస్ సిరిసిల్లలో సభ నిర్వహించడం బీజేపీపై చేస్తున్న కుట్రకు నిదర్శనమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఆరా సర్వేపైనా బండి సంజయ్ వ్యాఖ్యలు
ఇక ఇదే సమయంలో ఆరా సర్వేను ప్రస్తావిస్తూ.. టీఆర్ఎస్ ఓట్ షేర్ తగ్గి, బీజేపీ గ్రాఫ్ పెరిగింది. మా ఓట్ షేర్ 23% పెరిగింది, అది మామూలు విషయం కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈరోజు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని, అయితే వారి గెలుపు ఓట్ల శాతం 8 శాతం తగ్గుతుందని, బీజేపీ ఓట్లు 23 శాతం పెరిగిందని హైదరాబాద్‌కు చెందిన ఓ పోలింగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో పేర్కొంది.












Click it and Unblock the Notifications