వచ్చే ఎన్నికల పొత్తులపై తేల్చేసిన బండి సంజయ్!!
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే ఎన్నికల పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బిజెపి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ తెలిపారు.
కరీంనగర్ లోని 57వ డివిజన్, 173వ పోలింగ్ బూత్ చైతన్యపురి మహా శక్తి ఆలయం నుండి ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. బండి సంజయ్ తన సొంత నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు .తొమ్మిదేళ్ల మోడీ పాలన ఏవిధంగా సాగిందో వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో మోదీ 9 ఏళ్ల పాలనపై ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు స్టిక్కర్లను ఇంటింటికీ అంటిస్తున్నామని తెలిపారు.
ఉదయం 9 గంటల వరకు దాదాపు 10 లక్షల కుటుంబాలతో బిజెపి నాయకులు, కార్యకర్తలు కలిశారని, ఈ మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల కుటుంబాలను కలిసి చరిత్ర సృష్టించే దిశగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారన్నారు. అంతేకాదు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడిన బండి సంజయ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికలలో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఒంటరిగా పోటీ చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కెసిఆర్ మళ్లీ జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ కట్టించిన ఇళ్ళు ముట్టుకుంటే కూలిపోతున్నాయని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేసినట్లేనని పేర్కొన్నారు.
తాను బి ఆర్ ఎస్ పార్టీ మద్దతుతో గెలిస్తే మరి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ఎలా గెలిచారో చెప్పాలంటూ ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ కు అసలు డిపాజిట్ వచ్చిందా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications