మోడీ కోరిక అదే: గొప్ప బడ్జెట్ అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఫైర్
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. తెలంగాణకు నిధులు ఇవ్వలేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ మూర్ఖంగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించారని బండి సంజయ్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గొప్ప బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు బండి సంజయ్. 2047 నాటికి భారత్‌ను అంతర్జాతీయంగా నెంబర్ 1గా చూడాలనేది మోడీ కోరిక అని తెలిపారు. ఆ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్ ఉందన్నారు. మౌలిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. దేశం పట్ల, ప్రజల పట్ల బీజేపీకి కమిట్మెంట్ ఉందని స్పష్టం చేశారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చిన మాట నిజం కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల పాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పింది కాంగ్రెస్, వంతపాడింది కేసీఆర్ అని అన్నారు.
వీరే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదాను విభజన చట్టంలో ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. డీపీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా సమర్పించని బీఆర్ఎస్.. ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
కాగా, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే లేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని సీఎం రేవంత్ తోపాటు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు కూడా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications