బీజేపీలో మార్పుల ప్రకంపనలు; బండి సంజయ్ కీలక సమావేశం!!
బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రానున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని శతవిధాల ప్రయత్నిస్తున్న బిజెపి సంస్థాగతంగా మార్పులు చేయడానికి రంగంలోకి దిగింది. బీజేపీలో రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల టీమ్ ను సిద్ధం చేసే పనిలో బిజెపి నాయకత్వం బిజీగా ఉంది.
ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించిన బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. పనితీరును బట్టి బాధ్యులను మార్చాలని బిజెపి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఎలాంటి మొహమాటలు లేకుండా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసేవారికి పట్టం కట్టాలని, పనిచేయని వాళ్ళని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

బండి సంజయ్ ఎన్నికల టీమ్ ను సిద్ధం చేసుకోవడానికి అమిత్ షా నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. గత కొంత కాలంగా రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల మార్పులు చేర్పులపై బిజెపిలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన కార్యదర్శులతో, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మార్పులుచేర్పులు చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సంస్థాగతంగా పార్టీకి 38 జిల్లాలు ఉండగా, వీటిలో సగానికి పైగా జిల్లా అధ్యక్షుల పనితీరు మెరుగ్గా లేదని అధ్యక్షులను మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక జిల్లా కమిటీల నాయకుల పనితీరు సరిగా లేదని దాదాపు 20నుండి 25జిల్లాల బిజెపి అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది.

దీంతో బీజేపీలో మార్పుల ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. మరి బండి సంజయ్ వచ్చే ఎన్నికలకు సైన్యాన్ని సిద్ధం చేయటానికి తీసుకునే మార్పులు, చేర్పులు ఏ విధంగా ఉంటాయి. అందరికీ ఆమోదయోగ్యమేనా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications