సర్వే నివేదికలు - పొత్తులపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..!!
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పొత్తులపైన కీలక ప్రకటన చేసారు. కాంగ్రెస్ - బీఆర్ఎస్ పొత్తు పైన కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. బీజేపీని అడ్డుకొనేందుకే బీఆర్‌ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్ పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఎవరు కలిసినా..తాము మాత్రం సింహం లాగా ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసారు. కొద్ది రోజులుగా టీడీపీ తో పొత్తు ఉంటుందనే ప్రచారం నడుమ పార్టీ నేతలు స్పష్టత కోరుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ దీని పైన క్లారిటీ ఇచ్చారు.
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయని వెల్లడించారు. బీజేపీని అడ్డుకునేందుకే బీఆర్ఎస్..కాంగ్రెస్ కలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. పొత్తు పైన కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహి అని సంజయ్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే బిల్ట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లలో గిరిజనుల కోసం ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పబ్లిక్ సర్వీసు కమిషన్ పేపర్ లీక్ పై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీక్‌కు బాధ్యుడైన కేటీఆర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్‌తో ముడిపెడుతూ గిరిజన రిజర్వేషన్లపై జాప్యం చేస్తున్నారని.. దమ్ముంటే ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్లు పెంచాలని సవాల్ చేశారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా గెలవకుండా కేసీఆర్ రూ.కోట్లు ఖర్చుచేశారని ఆరోపించారు. బీజేపీ అధికారం చేపట్టగానే ఓల్డ్ సిటీని న్యూ సిటీగా అభివృద్ధి చేస్తామని సంజయ్ చెప్పారు. బలిదానాలు, త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ విమర్శించారు.












Click it and Unblock the Notifications