ఆ విషయంలో తెలంగాణాకు కేంద్రం హెచ్చరిక, కవితకు హ్యాట్సాఫ్ అన్న కేంద్రమంత్రి
నీళ్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా, బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై విచారణ తప్పించుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.
కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించిన బండి సంజయ్, పాలమూరు-రంగారెడ్డి అంశంలో ఉద్యమం చేసింది బిజెపి అంటూ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా ఇలాంటి ఉద్యమాలు చేసిందా? అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా తెలంగాణ వచ్చాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 4.3 టీఎంసీల నుంచి 13.7 టీఎంసీలకు పెంచినా నోరు మెదపని వ్యక్తి కేసీఆర్ అని ధ్వజమెత్తారు.

ప్రాజెక్ట్ ల పేరుతో కేసీఆర్ దోపిడీ
ప్రజలను మభ్యపెట్టేందుకు కాళేశ్వరం పేరుతో "కూలేశ్వరం" ప్రాజెక్టు నిర్మించి దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపించారు. రూ.30 వేల కోట్ల ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచి వేల కోట్లు దోచుకున్నారని, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి పేరుతో రూ.27వేల కోట్లు ఖర్చు చేసి చుక్క నీరు ఇవ్వలేదని విమర్శించారు. భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీలు లేని ప్రాజెక్టు అంచనాలను రూ.80వేల కోట్లుగా రూపొందించి, తర్వాత లక్షన్నర కోట్లకు పెంచి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు.
తెలంగాణాకు కేంద్రం హెచ్చరిక
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని కేంద్రం పలుమార్లు హెచ్చరించిన గత కేసిఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా సంగమేశ్వర ప్రాజెక్టు ప్రారంభించినా స్పందించలేదని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా మౌనం పాటించారని విమర్శించారు.
సీఎం జగన్ తో కలిసి కేసీఆర్ చేసిందిదే
ఏపీ ప్రభుత్వం ఒప్పందానికి మించి 38 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నా కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్‌లో అప్పటి ఏపీ సీఎం జగన్‌తో సమావేశమై "బేసిన్లు లేవు, బేషజాల్లేవు" అంటూ మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. రాయలసీమకు కావాల్సినన్ని నీళ్లు ఇస్తామని ఒప్పుకున్నది నిజం కాదా? అంటూ బండి సంజయ్ నిలదీశారు.
కవితకు హ్యాట్సాఫ్. రోజా ఇంట్లో దావత్ వెనుక మర్మం చెప్పాలని విజ్ఞప్తి
నాటి మంత్రి రోజా గులాబీ రేకులతో స్వాగతం పలికి, రొయ్యల పులుసుతో విందు ఇచ్చిన తర్వాత కేసీఆర్ ధోరణి మారలేదా? అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విందు కారణంగానే తిరుమల టూర్ కూడా రద్దు చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బయటపెడుతున్న కవితకు హ్యాట్సాఫ్ అంటూనే కవిత రోజా ఇంట్లో దావత్ వెనుక ఉన్న మర్మాన్ని కూడా బయటపెట్టాలని కోరారు.












Click it and Unblock the Notifications