కేసీఆర్, కేటీఆర్ చెప్పే అబద్ధాలకు ఇదే నిదర్శనం: ముంబైకి వెళ్లే పాలమూరు ప్రజలతో బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు పచ్చబడ్డదని, వలసలు పూర్తిగా ఆగిపోయాయంటూ సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 16 వ రోజు శుక్రవారం నారాయణపేట చేరపకున్నారు బండి సంజయ్.

పాలమూరు వలసలు ఆగలేదు..: ముంబైకి వెళ్లే బస్సు వద్ద బండి సంజయ్
ఈ సందర్బంగా ముంబయి వెళ్తున్న బస్సును ఆపి అందులో ముంబయి వెళ్తున్న వారిని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతీ రోజు బస్సు ఎక్కడి నుంచి వెళ్తుందని.. బస్సులో ఎంత మందిని తీసుకెళ్తారని డ్రైవర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పాలమూరులో వలసలు ఆగలేదని... నిత్యం ముంబైకి వందలాది మంది వలస వెళుతున్నారనడానికి నారాయణపేట డిపో నుంచి వెళుతున్న ఈ బస్సే నిదర్శనమన్నారు.

ముంబైకి వెళ్లే బస్సులో ప్రజలతో బండి సంజయ్
బస్సులోని వారిని ప్రశ్నిస్తే తాము ఉపాధి కోసం ముంబై వెళుతున్నామని జవాబిచ్చారని, అందులో చిన్న పిల్లలు, చంటిపాప తల్లులు కూడా ఉండటం కేసీఆర్ పాలనతీరును గుర్తుచేస్తుందన్నారు. ఉన్న ఊరిని వదిలి వెళ్లాలని లేకపోయినప్పటికీ బతికే దారిలేక వలస వెళుతున్నామని వలసవెళుతున్న వారు బండి సంజయ్‌తో వాపోయారు. కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలతోనే కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్ పచ్చి అబద్ధాలకు ఇదే నిదర్శనమన్న బండి సంజయ్
ఇది ఇలావుండగా, సమతామూర్తి విగ్రహా విష్కరణకు రావొద్దంటూ పీఎంవో నుంచి సీఎం కేసీఆర్‌కు ఫోన్ వచ్చిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చెప్పడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. తండ్రీ కొడుకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతారనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం రాత్రి మక్తల్ నియోజకవర్గం పగిడిమర్రి గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో బండి సంజయ్ మాట్లాడారు. సాక్షాత్తు ప్రధాని మోడీని అవమానించేలా అబద్దాలు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. అనారోగ్య కారణాల వల్లే విగ్రహావిష్కరణకు రావట్లేదని ప్రకటించింది కేసీఆరే అన్నారు.
మోడీని కలవడానికి ముఖం చెల్లకే సమతామూర్తి విగ్రహావిష్కరణకు కేసీఆర్ రాలేదని ప్రజలందరికీ తెలుసన్నారు. అబద్ధాలతో కాలం వెల్లదీస్తూ, ప్రజలను మోసం చేస్తూ కుర్చీ కాపాడుకుంటున్న దౌర్భాగ్య సీఎం కేసీఆర్ అని సంజయ్ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications