వారికి ఆ రూ.10వేల కోట్లు ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి హెచ్చరిక!
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని విజిలెన్స్ దాడులు పేరుతో బెదిరిస్తుంది అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు యాజమాన్యాలతో కలిసి ఫీజు బకాయిలపైన బిజెపి పోరుబాటను ప్రారంభించిందని ఆయన అన్నారు.
ఫీజు బకాయిలపై కేంద్ర మంత్రి దృష్టికి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు
ఈరోజు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ భేటీ అయ్యారు. బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవడం లేదని కాలేజీ యాజమాన్యాలు బండి సంజయ్ కు చెప్పి వాపోయారు.నెలానెలా బకాయిలు చెల్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కూడా నెరవేరడం లేదని వారు బండి సంజయ్, లక్ష్మణ్ ల దృష్టికి తీసుకువెళ్లారు.

నాలుగేళ్ళుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్
సిబ్బందికి జీతాలు, కాలేజీ అద్దె, మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుతో ప్రైవేట్ కళాశాలలు కుదేలయ్యే పరిస్థితి వచ్చిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2500విద్యాసంస్థలు ఉండగా 15లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి ప్రైవేట్ కళాశాలల్లో చదువుకుంటున్నారని, రాష్ట్రప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదని వారు వాపోయారు.
సీఎం ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు
దాదాపు పదివేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకు పోయాయని, ఎన్నిసార్లు అడుగుతున్న ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ప్రతి నెల 500 కోట్ల చొప్పున ఏడాదిలో 6 వేల కోట్ల రూపాయలను చెల్లిస్తామని వీటితోపాటు మిగిలిన బకాయిలను కూడా చెల్లిస్తామని అన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని నేటి వరకు ఒక్క నెల బకాయిలు కూడా చెల్లించలేదని వారు బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లారు.
15లక్షల విద్యార్థుల కోసం బీజేపీ పోరు బాట
ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ విషయాల్లో పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు తో ఫోన్లో మాట్లాడి ప్రైవేట్ కళాశాలలు యాజమాన్యాలతో కలసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి బిజెపి పోరుబాట చేస్తుందన్నారు.
బకాయిలు చెల్లించకుంటే రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్
విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, యాజమాన్యాల పక్షాన పోరాడాలని నిర్ణయం అని వెల్లడించారు .బకాయిలు చెల్లించకపోతే రెండ్రోజుల్లో యాక్షన్ ప్లాన్ ను అమలుకు బీజేపీ సిద్ధమవుతోంది. వివిధ రూపాలలో నిరసనను తెలపడంతో పాటు నవంబర్ మొదటివారంలో ప్రైవేట్ కళాశాలలో చదివే లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు కళాశాలలో సిబ్బందితో కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications