బాసర సరస్వతి ఆలయ పునర్నిర్మాణం: 50 కోట్లతో పనులు షురూ
ఆదిలాబాద్: తెలంగాణలోమరో ప్రముఖ పుణ్యక్షేత్రానికి మెరుగులు దిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం పనులకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
తెల్లవారుజామునే ముగ్గురు అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ అనంతరం గురు ప్రార్థన గోపూజ, గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభించారు. కల్చస్థాపన రక్షాబంధనము మండపారాధన పుణ్యా వచనము, దీక్ష సంకల్పంతో , వాస్తు నవగ్రహ హోమము నిర్వహించారు ఆలయ అర్చకులు. బాసర సరస్వతి అమ్మవారి గర్భాలయ పునః నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటికే రూ.8కోట్ల వ్యయంతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు, తదితర పనులు చేపట్టగా.. రూ.22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించారు.
దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు చేపట్టనున్నామన్నారు.












Click it and Unblock the Notifications