చంద్రబాబు రేవంత్ రెడ్డిల భేటీకి ముందు ఏపీ అధీనంలోని ఆస్తుల స్వాధీనంపై మంత్రి ఆదేశం!!
జూన్ రెండవ తేదీ 2024తో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు పూర్తయింది. ఆ రోజుతో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు కూడా ముగిసింది. దీంతో హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆర్ అండ్ బి శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ పైన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆ భవనాల స్వాధీనానికి మంత్రి ఆదేశం
నేడు తన చాంబర్లో ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహించిన రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీ రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ఉన్న అతిథి గృహం, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శనగర్, బషీర్ బాగ్, కుందన్ బాగ్, గ్రీన్ ల్యాండ్స్, మంజీరా అతిధి గృహాలతో పాటు వివిధ ప్రాంతాలలో ఉన్న ఎమ్మెల్యేల నివాస సముదాయాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు.

ఏపీ అధీనంలో భవనాల స్వాధీనానికి కార్యాచరణ సిద్ధం చెయ్యాలన్న మంత్రి
ఏపీ అధీనంలో ఉన్న భవనాలను చేసుకోవడానికి కార్యచరణ సిద్ధం చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల పైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించి అన్ని అంశాల పైన నివేదిక తయారు చేయాలని, ఆయా శాఖ అధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే.
రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై సీఎంల భేటీ
అంతే కాదు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకుందాం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయగా, జూలై 6వ తేదీన ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ పలు అంశాల పైన చర్చించనున్నారు.

ఏపీ భవనాలను అధీనంలోకి తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి
ఇక ఇదే సమయంలో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకనుండి కేవలం తెలంగాణ రాజధానిగా ఉంటుందని, ఈ 10 ఏళ్లలో ఏపీకి కేటాయించిన అధికారిక భవనాలను రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ అతిథి గృహాలను రోడ్లు భవనాలు శాఖ పరిధిలో ఉన్న ప్రభుత్వ అతిథిగృహాలను స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
సీఎంల భేటీకి ముందే దూకుడుగా తెలంగాణా సర్కార్
ఇక ఈ సమావేశంలో ఆర్ అండ్ బి శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రెటరీ హరీష్, ఈఎంసి గణపతి రెడ్డి, సీఈ మధుసూదన్ రెడ్డి, మోహన్ నాయక్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల సీఎంల భేటీకి ముందు తెలంగాణా ప్రభుత్వ నిర్ణయం ఆసక్తిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications