ఆటోవాలా అవతారంలో యాంకర్ రవి..యానీ మాస్టర్: ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కోసం రోడ్ షో
హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగింపుదశకు వచ్చేసింది. ఇంకో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఫినాలెను గ్రాండ్‌గా నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలె ఈ ఆదివారం ఉంటుంది. బాలీవుడ్ స్టార్ జోడి రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. రణ్‌వీర్ సింగ్ నటించిన 83 మూవీ త్వరలో విడుదల కానుంది. రామ్‌చరణ్, ఆలియా భట్ కూడా అటెండ్ కానున్నారు.

కంటెస్టెంట్ల మధ్య టఫ్ కాంపిటీషన్..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్‌ను గెలుచుకోవడానికి కంటెస్టెంట్ల మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. ఫైనలిస్టులు ఎవరో ఈ పాటికే తేలిపోయింది. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, వీజే సన్నీ, యాంకర్ సిరి హన్మంతు, యుట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, మానస్ నాగులపల్లి టాప్-5లో చోటు దక్కించుకున్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే టైటిల్ అందుకోనున్నారు. ఆ ఒక్కరు ఎవరనేది ఈ ఆదివారం రాత్రికి అధికారికంగా తెలిసిపోతుంది. విన్నర్‌కు ప్రైజ్ మనీ కింద 50 లక్షల రూపాయలతో పాటు ఓ ప్లాట్‌ను అందించనున్నారు నిర్వాహకులు.
విన్నర్ ఎవరు?
టైటిల్ కోసం పోటీ పడుతోన్న అయిదుమందిలో ఎవరు చివరి వరకు నిలుస్తారు.. విన్నర్‌గా ఆవిర్భవిస్తారనేది తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. వీక్షకులు వేసే ఓట్ల మీద వారి భవిష్యత్ ఆధారపడి ఉంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. రోడ్ షోలను సైతం నిర్వహిస్తున్నారు అభిమానులు. శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్, వీజే సన్నీ మధ్య ప్రధానంగా పోటీ ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో- ఈ ముగ్గురి ఫ్యాన్ క్లబ్స్ రంగంలోకి దిగాయి. రోడ్ షోలను నిర్వహిస్తోన్నాయి.

యాంకర్ రవి సైతం..
టాప్ యాంకర్, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 మాజీ కంటెస్టెంట్ రవి సైతం రోడ్ షోలను నిర్వహిస్తోన్నాడు. అతను శ్రీరామచంద్రకు సపోర్ట్ చేస్తోన్నాడు. దీనికోసం ఏకంగా ఆటోడ్రైవర్ అవతారం ఎత్తాడీ యాంకర్. బిగ్‌బాస్ హౌస్.. అన్నపూర్ణ స్టూడియోస్ రావాలమ్మా రావాలి..అంటూ ఆటోవాలాలా ఆకట్టుకుంటున్నాడు. ఆటో ఎక్కడానికి వచ్చిన వారితో బిగ్‌బాస్ విన్నర్ గురించి డిబేట్స్ చేస్తూ కనిపించాడు. శ్రీరామచంద్రకు ఓటు వేయాలంటూ పోస్టర్‌ను అతికించిన ఆటో అది. శ్రీరామచంద్ర ఒక్కడే బిగ్‌బాస్ టైటిల్ కోసం మోస్ట్ డిజర్వింగ్ పర్సన్‌గా యాంకర్ రవి సపోర్ట్ చేశాడు.
యానీ మాస్టర్ కూడా..
మరో మాజీ కంటెస్టెంట్ యానీ మాస్టర్ కూడా తక్కువేమీ తినలేదు. ఆమె కూడా శ్రీరామచంద్ర కోసం క్యాంపెయిన్ బరిలో దిగారు. శ్రీరామచంద్రకు ఓటు వేయాలంటూ ఫోన్ నంబర్ ముద్రించిన పోస్టర్‌ను అతికించిన ఆటో డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోన్నాయి. శ్రీరామచంద్ర ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయ్యాయి. యానీ మాస్టర్, యాంకర్ రవి బ్యాంక్ అండ్ బ్యాక్ వారల్లో బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. వీరిద్దరిలో తొలుత యానీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఆ తరువాతి వంతు యాంకర్ రవిది.

షణ్ముఖ్ జశ్వంత్ కోసం..
టైటిల్ విన్నింగ్ రేసులో ఉన్న మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ కోసం కూడా ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. వైజాగ్ బాయ్‌ను గెలిపించాలంటూ ప్రచారం చేస్తోన్నారు అతని అభిమానులు. షణ్ముఖ్ ఫొటోలు, ఓటు వేయడానికి ఉద్దేశించిన ఫోన్ నంబర్‌ను ముద్రించిన పోస్టర్లు, ఫ్లెక్సీలను పలుచోట్ల అమర్చారు. హోర్డింగులు సైతం వెలిశాయి. వీజే సన్నీ అభిమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అతని కోసం తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications