ఏకతాటిపైకి విపక్షాలు: త్వరలో కేసీఆర్‌తో భేటీ కానున్న నితీష్ కుమార్
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మరోవైపు, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ను కూడా కలవాలనే యోచనలో నితీష్ ఉన్నట్లు తెలిసింది.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా చర్చలు జరపనున్నారు. మహా కూటమి ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే తాను దాదాపు అన్ని పార్టీల నాయకులతో మాట్లాడానని.. ఐక్యంగా ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను నితీష్ కుమార్ కలిసిన విషయం తెలిసిందే.

త్వరలో చాలా పార్టీలు ఏకతాటిపైకి వస్తాయని.. కాంగ్రెస్ పార్టీతో సమగ్రంగా చర్చించినట్లు నితీష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఐక్యంగా ముందుకు సాగేందుకు వారంతా అంగీకరించారని తెలిపారు. అందరి ఆమోదంతో తామంతా బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటికిపై వచ్చే పనిలో ఉన్నామన్నారు. దీనిలో భాగంగా సీపీఐతో కూడా మాట్లాడామని చెప్పారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏం చేయాలన్నదానిపై నిర్ణయించుకునేందుకు విపక్షాలన్నీ ఒక చోట కూర్చుని చర్చించుకోవాలన్నది తన కోరిక అని నితీష్ కుమార్ తెలిపారు. గత బుధవారం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో కలిసి నితీష్ కుమార్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయిన నితీష్.. ఇప్పుడు కేసీఆర్‌తోనూ భేటీ అయ్యేందుకు నితీష్ కుమార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే కేసీఆర్-నితీష్ కుమార్ భేటీ ఉండనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications