నకిలీ రసీదులు, అందుకే రిజిస్ట్రేషన్ అవ్వలేదు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఓ ద్విచక్ర వాహన షోరూంలో భారీ కుంభకోణం జరిగింది. షోరూం యజమానికి తెలియకుండా.. షోరూం సిబ్బంది బైకులను విక్రయించి ఆ డబ్బుని వారి జేబులోకి వేసుకున్నారు. ఈ వాహనాలను కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
గోల్కోండ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. టోలిచౌకిలోని హోండా బైక్స్ షోరూంలో పనిచేసే ఏడుగురు సిబ్బంది యజమానికి తెలియకుండా 27 బైకులను వినియోగదారులకు విక్రయించి వచ్చిన సొమ్మును పంచుకున్నారు. వీటిని కొన్నవారికి నకిలీ రసీదులు ఇవ్వడంతో.. ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అవ్వలేదు.

దీంతో బైకులను కొనుగోలు చేసిన వినియోగదారులు షోరూంకు వచ్చి సిబ్బందిని నిలదీయగా.. రేపు మాపు అంటూ సిబ్బంది బెబుతున్నారు. వాహనాన్ని కొనుగోలు చేసి చాలా రోజులు కావస్తున్నప్పటికీ.. రిజిస్ట్రేషన్ అవ్వకపోవడంతో అనుమానం వచ్చి వినియోగదారులు విషయాన్ని షోరూం యజమాని దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రికార్డులు తనిఖీ చేశారు.
దీంతో బైకుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షోరూం యజమాని ఫిర్యాదు చేయడంతో షోరూంలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని వీరు అమ్మకం జరిపిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications