వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే: బీజేపీ-బీఆర్ఎస్ ఆందోళన..!!
ఖమ్మం: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇవ్వాళ పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. అలాగే- 699 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకూ ఆయన శంకుస్థాపన చేశారు.

16 బోగీలతో..
ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అశ్విని వైష్ణవ్, జీ కిషన్ రెడ్డి, దక్షిణమధ్య రైల్వే అధికారులు హాజరయ్యారు. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య పరుగులు తీసే ఈ ఎక్స్ ప్రెస్ లో మొత్తం 16 బోగీలు ఉన్నాయి. అందులో 14 చైర్ కార్, రెండు ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్స్. ఈ రైలు సీటింగ్ కెపాసిటీ 1128. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య వారంలో ఆరు రోజుల పాటు రాకపోకలు సాగిస్తుంది. ఆదివారం ఈ సర్వీస్ అందుబాటులో ఉండదు.

ప్రత్యేకతలివే..
ఈ రైలుకు ఉన్నవన్నీ ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్. వాటంతటవే తెరచుకుంటాయి. నిర్దేశిత సమయం పూర్తి కాగానే మళ్లీ మూసుకుంటాయి. ప్రస్తుతం ఈ తరహా వ్యవస్థ మెట్రో రైలులో మాత్రమే అందుబాటులో ఉంది. డోర్ మూసుకోకపోతే అక్కడే ఉన్న గ్రీన్ బటన్ ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రయాణికులకు. అత్యవసర సమయంలో ర్యాక్ తలుపులు తెరచుకోవడానికి రెడ్ బటన్ ను అందుబాటులో ఉంచారు. ఏదైనా ఇబ్బందులు వస్తే- ఆ సమాచారాన్ని ట్రైన్ క్రూనకు తెలియజేయడానికి ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ ను ఏర్పాటు చేశారు.

ఖమ్మంలో ఉద్రిక్తత..
ఈ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కిన సందర్భాన్ని పురస్కరించుకుని ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ-భారత్ రాష్ట్ర సమితి నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ రెండు పార్టీల నాయకులు ఒకేసారి రైల్వే స్టేషన్ కు చేరుకోవడం, ఎదురెదురు తారసపడటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నినాదాలు- ప్రతి నినాదాలు చేసుకున్నారు. పోటాపోటీ నినాదాలతో రెచ్చిపోయారు.

కాషాయమయం..
వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు స్వాగతం పలకడానికి ఖమ్మం రైల్వే స్టేషన్ వద్దకు బీఆర్ఎస్-బీజేపీ నాయకులు ఒకేసారి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోలను అతికించిన ప్లకార్డులను బీజేపీ నాయకులు ప్రదర్శించారు. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. కాషాయరంగులో ఉన్న బెలూన్లను ఎగురవేశారు. మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాస్కులను ధరించారు.

దేశ్ కీ నేత..
అదే సమయంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. గులాబీ రంగ కండువాలను ధరించి పెద్ద ఎత్తున స్టేషన్ వద్దకు వచ్చారు. దేశ్ కీ నేతా కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నాయకులతో పోటీ పడుతూ నినాదాలు చేశారు. స్టేషన్ ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లడానికీ ఇరు పార్టీల నాయకులు కూడా ప్రయత్నించారు.

పోలీసుల జోక్యంతో..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు పార్టీల నాయకులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిని శాంతిపజేశారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ వెళ్లిపోయేంత వరకూ ఈ రెండు పార్టీల మధ్య నినాదాలు- ప్రతినినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు వారిని శాంతింపజేసి వెనక్కి పంపించేశారు.












Click it and Unblock the Notifications