రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చి.. బీజేపీలో పరిస్థితులపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!!
హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ బిజెపిలో తాను ఇమడలేకపోతున్నానని, తనకు బండి సంజయ్ కు గొడవ జరిగిందని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తనని కాంగ్రెస్ లో చేరాలన్న రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు. తాను గొడవలు పడే వ్యక్తిని కాదన్నారు. ఏ పార్టీలోనైనా కొత్త నాయకుడు చేరినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురు కావడం సహజమేనని, కొత్త, పాత నేతలు సర్దుకోవడానికి సమయం పడుతుందన్నారు.
అయినప్పటికీ బిజెపిలో పాత, కొత్త నేతల మధ్య ఎటువంటి వివక్ష, వివాదాలు లేవని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఒక పార్టీలో సుదీర్ఘకాలం కీలక హోదాల్లో పనిచేసిన ఓ నాయకుడు కొత్తపార్టీలో చేరినప్పుడు సమస్యలు ఎదురవుతాయని, అవి ఏ పార్టీలోనైనా సహజమేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుండి వచ్చే నేతల అనుభవాన్ని పార్టీ బలోపేతం చేయడంకోసం ఉపయోగించుకోవాలని బిజెపి పెద్దల ఉద్దేశమని ఈటల పేర్కొన్నారు.

ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు, ఏ పార్టీలో చేరినప్పటికీ వారి వ్యక్తిగత పెరుగుదలను కూడా కోరుకుంటారని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీ మారినప్పుడు పదవులను ఆశించడం దేశంలో కామన్ అని ఈటల రాజేందర్ అన్నారు. అయితే తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని ఈటల అన్నారు. తన జీవితంలో ఏనాడు పదవి కావాలని నోరు తెరిచి అడగలేదని ముందు ముందు ఎప్పుడూ అడగబోనని ఈటల స్పష్టం చేశారు.
తనను పార్టీ ఎలా ఉపయోగించుకుంటుంది అనేది పార్టీ పెద్దల ఇష్టమన్నారు. తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించాలి అనేది వారి నిర్ణయం తీసుకుంటారన్నారు. వారు ఎటువంటి బాధ్యతలు అప్పగించిన తప్పక నిర్వర్తిస్తానని ఈటల పేర్కొన్నారు. తనకు చేరికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలోని పలువురు నేతలను బిజెపిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశానని ఆయన పేర్కొన్నారు.
ఇక ఇదే సమయంలో జాతీయ పార్టీల విధానాలకు, ప్రాంతీయ పార్టీల విధానాలకు మధ్య ఉండే వ్యత్యాసంపై ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలలో రాష్ట్రంలో జరిగే విషయాలను కళ్ళతో చూసి, చెవులతో విని నిర్ణయాలు తీసుకుంటారని, అన్ని జాతీయ పార్టీల పరిస్థితి ఆ విధంగా ఉండదని, రాష్ట్రాలలో జరిగే విషయాలు వినడమే తప్పించి, అసలేం జరుగుతుంది అన్నది చూసే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.
జాతీయ పార్టీలో ఉండే నేతలు ఎవరైనా రాష్ట్ర పరిస్థితుల గురించి ఎవరికైనా చెప్పాలి అంటే కచ్చితంగా ఢిల్లీకి వెళ్లాల్సిందే అని, అందుకే తాను కూడా ఢిల్లీ వెళ్లానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించిన రేవంత్ రెడ్డికి ముందు మీ పార్టీని కాపాడుకోండి, మీ నాయకులను కాపాడుకోండి, మీ వారిని బి ఆర్ ఎస్ వాళ్ళు ఎత్తుకు పోకుండా చూసుకోండి అంటూ హితవు పలికారు. కర్ణాటకలో గెలిస్తేనే దేశమంతా గెలిచినట్టా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications