తెలంగాణలో 10 ఎంపీ స్థానాలను గుర్తించిన బీజేపీ.. బ్లూప్రింట్ సిద్ధం?
తెలంగాణను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ జనతాపార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. 'మంచి తరుణం మించిన రాదు' అన్నట్లుగా రాష్ట్రాన్ని దక్కించుకోవడానికి ఇదే చివరి అవకాశం అనే రీతిలో ప్రయత్నిస్తోంది. ఆ దూకుడులోను తనదైన రాజకీయాన్ని ప్రదర్శిస్తోంది. తెలంగాణలో కమలం జెండా రెపరెపలాడాలంటే ఎమ్మెల్యే సీట్లు ఎంత ముఖ్యమో కేంద్రంలో మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలంటే అంతేస్థాయిలో ఎంపీ సీట్లు కూడా అవసరమని అధినాయకత్వం భావిస్తోంది.

1. 70 నుంచి 90 వరకు తగ్గుతాయని అంచనా..
మిత్రపక్షాలతో కలిపి వరుసగా రెండుసార్లు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఎన్నికల్లో కనీం 70 నుంచి 90 సీట్లు ఎన్డీయే కూటమికి తగ్గుతాయని బీజేపీ అంచనా వేస్తోంది. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే కృతనిశ్చయంతో ఉన్న మోడీ-షా ద్వయం తగ్గే సీట్లను దక్షిణాది నుంచి పూడ్చుకోవాలనుకుంటోంది. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్న మొత్తం 17 ఎంపీ సీట్లలో 10 చేజక్కించుకోవాలనుకుంటోంది. అందుకు తగ్గ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది.

2. 10 నియోజకవర్గాల్లో గెలుపొందాలి
రోజురోజుకు బలపడుతున్న తెలంగాణలో గత ఎన్నికల్లో ఆ పార్టీ సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేసింది. రానున్న ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలతోపాటు మరో ఆరు గెలుచుకుంటే మొత్తం 10 అవుతాయని భావిస్తోంది. చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, ఉమ్మడి వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గం చొప్పున మొత్తం 10 నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలనేది పార్టీ వ్యూహంగా ఉంది. ఇటీవల కొన్ని సర్వేల్లో తెలంగాణలో బీజేపీ ఆరు నియోజకవర్గాలను గెలుచుకుంటుందని తెలియజేస్తున్నాయి. అంటే ఇంకా నాలుగు కావాలంటే పార్టీ మరింత బలపడాల్సి ఉంది. ఆ దిశగానే పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం బీజేపీకీ మైనస్
కొన్ని రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు బలంగా ఉండటం కూడా ఆ పార్టీకి అడ్డంకిగా మారుతోంది. టీఆర్ ఎస్, వైసీపీ, డీఎంకే, టీఎంసీ, ఎన్‌సీపీ, ఎస్పీ లాంటిపార్టీలన్నీ బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త మిత్రులను చేర్చుకోవడంతోపాటు ఇంతవరకు గెలవని నియోజకవర్గాలపై ఆ పార్టీ దృష్టిసారించింది. ముఖ్యంగా దక్షిణాదిలో కొన్ని సీట్లయినా దక్కించుకోవాలనే పట్టుదలతో మోడీ, షా ఉన్నారు. వారి పట్టుదల నెగ్గుతుందా? లేదంటే ప్రజల అభిప్రాయం ప్రకారం సీట్లు వస్తాయా? అనేది తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.!!












Click it and Unblock the Notifications