కేయూ ఘటన: వరంగల్ సీపీ రంగనాథ్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సవాల్!!
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను పోలీసులు దారుణంగా కొట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న క్రమంలో యూనివర్సిటీలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా కేయూలో విద్యార్థులను పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వరంగల్ సిపి రంగనాథ్ కు సవాల్ విసిరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత మీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ ఆయన ప్రశ్నించారు.
పోలీసులు తమను చితకబాదారు అని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారని పోలీసులు మాత్రం స్టూడెంట్స్ పై తాము ఎలాంటి దాడులు జరపలేదని చెప్పడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ సిపి రంగనాథ్ వ్యవహార శైలి కరెక్ట్ గా లేదని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. వరంగల్ సిపి రంగనాథ్ వెంటనే విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

విద్యార్థులను కొట్టలేదని చెబుతున్న సిపి కేయూ విద్యార్థులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచటానికి 12 గంటలు ఎందుకు పట్టిందని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే వారిని ఎందుకు కోర్టులో హాజరు పరచలేదని రఘునందన్ రావు అడిగారు. విద్యార్థులను స్టేషన్ నుండి ఎందుకు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు తీసుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఎక్కడెక్కడో ఎందుకు తిప్పారు అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు. విద్యార్థులను మధ్యాహ్నం అరెస్టు చేస్తే, మెజిస్ట్రేట్ ముందు అర్ధరాత్రి వరకు ఎందుకు హాజరు పరచలేదో చెప్పాలన్నారు. అధికారం చేతిలో ఉందని, యూనిఫామ్ ఒంటిపై ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
చంద్రబాబు పాలనలోనూ, వైయస్సార్ హయాంలోనూ ఇంతగా దౌర్జన్యాలు జరగలేదని రఘునందన్ రావు పేర్కొన్నారు. పోలీసులు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం ఇంకా నాలుగు నెలల పాటు మాత్రమే ఉంటుందని రఘునందన్ రావు గుర్తు చేశారు. పోలీసులు ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 12వ తేదీన వరంగల్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి పోలీస్ అధికారులు చెంచాగిరి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications