బీజేపీలో 'ఈటల' దుమారం-పెద్దిరెడ్డిని బుజ్జగిస్తున్న బండి సంజయ్-వ్యతిరేకిస్తున్నవారికి రాజా సింగ్ వార్నింగ్
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ చర్చంతా 'ఈటల' చుట్టే తిరుగుతోంది. ఈటల ఢిల్లీ వెళ్లడం,బీజేపీ పెద్దలను కలవడంతో కమలం గూటిలో ఆయన చేరిక లాంఛనంగానే కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈటల చేరికను ధ్రువీకరించారు. అయితే ఈటల బీజేపీలో చేరుతున్న వేళ.. సీనియర్ నేత పెద్దిరెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో పార్టీలో దీనిపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
ఓవైపు పెద్దిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతుండగానే... మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ దీనిపై కాస్త ఘాటుగానే స్పందించారు. ఈటల చేరికను పార్టీలో ఎవరూ వ్యతిరేకించట్లేదని చెబుతూనే... ఎవరిని అడిగి ఆయన్ను చేర్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
వ్యతిరేకిస్తే... వారికే నష్టం : రాజా సింగ్
బీజేపీలో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తావు లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాకను వ్యతిరేకిస్తే వారికే నష్టమన్నారు. ఈటల వస్తే ఆయనతో పాటు చాలా మంది టీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు బీజేపీలోకి వస్తారని పేర్కొన్నారు. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలో జాతీయ నాయకత్వానికి తెలుసని... ఈటల వస్తే బీజేపీ నుంచి బయటకు వెళ్తామనటం సరైంది కాదని మండిపడ్డారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. బీజేపీ తాత, తండ్రుల పార్టీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

పెద్దిరెడ్డిని బుజ్జగిస్తున్న బీజేపీ
అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పెద్దిరెడ్డిని బుజ్జగించే పనిలో పడింది. ఈటల చేరికకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్దిరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఈ మేరకు బండి సంజయ్ పెద్దిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఆయన అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈటల చేరిక పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకి కాబోదని బండి సంజయ్ ఆయనతో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
దీంతో పెద్దిరెడ్డి ఈటల చేరికపై సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లి.. ఈటల చేరికపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. అంతా కలిసి పార్టీ కోసం పని చేయాలని డీకే అరుణ సూచించినట్లు సమాచారం.

ఉప్పెన తప్పదన్న పెద్దిరెడ్డి
ఈటల బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం మొదలవగానే మాజీ మంత్రి,బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే బీజేపీలో ఉప్పెన తప్పదని ఆయన హెచ్చరించారు. హుజురాబాద్ నుంచి గతంలో రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన తనతో కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా ఈటలను పార్టీలో చేర్చుకోవడం బాధించిందని ఇటీవల పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈటల విషయంలో బీజేపీ తొందరపడుతోందని... ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిగేంతవరకైనా వేచి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు,ఒకవేళ ఈటల బీజేపీలో చేరి... హుజురాబాద్‌కు ఉపఎన్నిక వస్తే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని ప్రకటించారు. పెద్దిరెడ్డి తిరుగుబాటుతో బీజేపీలో కలకలం రేగింది. దీంతో రాష్ట్ర నాయకత్వం ఇప్పుడాయనను సముదాయించే పనిలో పడింది.












Click it and Unblock the Notifications